Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!

  • పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం
  • స్లో ఓవర్‌రేట్ కారణంగా అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా
  • ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం బీసీసీఐ చర్యలు
  • ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి స్లో ఓవర్‌రేట్ తప్పిదం..
Axar Patel

Axar Patel

Axar Patel: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా అక్షర్‌ పై బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల ఫైన్ విధించారు అధికారులు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో స్లో ఓవర్‌రేట్ సమస్య తరచుగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు కెప్టెన్లు బీసీసీఐ నుంచి శిక్షలు ఎదుర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా వంటి కెప్టెన్లపై కూడా చర్యలు తీసుకున్నారు. గతంలో ఒకే జట్టు పదేపదే స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడితే కెప్టెన్‌పై సస్పెన్షన్ విధించే నిబంధన ఉండేది. అయితే 2025 నుంచి ఆ నియమాన్ని బీసీసీఐ రద్దు చేసింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధారణ పోరాటంతో 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టును ముందుండి నడిపిస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

అక్షర్ పటేల్ కేవలం 30 బంతుల్లో 56 పరుగులు చేసి ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో 20 ఇన్నింగ్స్‌ల తర్వాత అక్షర్‌కు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. డేవిడ్ మిల్లర్ కూడా 28 బంతుల్లో 51 పరుగులు చేసి ఢిల్లీ విజయానికి కారకుడయ్యాడు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు అశుతోష్ శర్మ 24 పరుగులు చేయగా, మాధవ్ తివారి 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పెనల్టిమేట్ ఓవర్ చివరి బంతికి ఔకిబ్ నబీ దార్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టడంతో ఢిల్లీ విజయాన్ని ఖాయం చేసుకుంది.

మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ జట్టు బ్యాటింగ్ భాగస్వామ్యాలను ప్రశంసించాడు. ఈ సీజన్‌లో మిడిల్ ఆర్డర్ నిలకడగా రాణించలేకపోయినా, ఈ మ్యాచ్‌లో అందరూ బాధ్యతగా ఆడారని తెలిపాడు. డేవిడ్ మిల్లర్‌తో నా భాగస్వామ్యం జట్టును గాడిలో పెట్టింది. ఆ తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారి వంటి యువ ఆటగాళ్లు అద్భుతంగా మ్యాచ్‌ను ముగించారని అక్షర్ పేర్కొన్నాడు.