NTV Telugu Site icon

Virat Kohli: రూల్స్‌ మార్చేశారు.. రెండుసార్లు బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ! వీడియో వైరల్

Virat Kohli

Virat Kohli

పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. వారం కిందటే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌ చేస్తోంది. ఈ క్రమంలో వాకా స్టేడియంలో ఇంట్రాస్క్వాడ్ వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు, బౌలరర్లు బరిలోకి దిగారు. మూడోరోజు వార్మప్‌కు సంబంధించి వీడియోను బీసీసీఐ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

గాయం నుంచి కోలుకున్న యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ వార్మప్‌ మ్యాచ్‌ ఆడాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రుతురాజ్‌ గైక్వాడ్‌, సర్ఫరాజ్‌ ఖాన్, వాషింగ్టన్ సుందర్ తదితరులు బరిలోకి దిగారు. అందరిలో రుతురాజ్‌ మంచి ఆటతీరు ప్రదర్శించాడు. మొదటిసారి కోహ్లీ 15 పరుగులకే ఔట్‌ కాగా.. రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చి 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 18 ఓవర్లు బౌలింగ్‌ చేశాడని కోచింగ్‌ సిబ్బంది తెలిపింది. సిరాజ్, జడేజా, అశ్విన్ కూడా బౌలింగ్ చేశారు. ఇక వీడియో చివరలో బౌలింగ్‌ కోచ్ మోర్నీ మోర్కెల్‌ మాట్లాడుతుండగా.. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం వచ్చిన సిరాజ్‌ వెనకుండి అతడిని ఆటపట్టించాడు.

Also Read: iQOO Neo 10 Series: ‘ఐకూ నియో 10’ సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్, ప్రైస్ డీటెయిల్స్ ఇవే!

అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మాట్లాడుతూ… ‘జట్టులోని ప్రతిఒక్కరికీ అవకాశం ఇచ్చాం. ఒకసారి ఔటైనా.. మళ్లీ మైదానంలోకి దిగేలా రూల్స్‌ను మార్చుకున్నాం. పిచ్‌ పరిస్థితులను అర్థం చేసుకొనేందుకు ఇలా చేశాం. బౌన్సీ పిచ్‌కు అలవాటు పడేందుకు రెండోసారి అవకాశం ఇచ్చాం. ఆస్ట్రేలియాకు రాకముందే నెట్ ప్రాక్టీస్‌, వార్మప్ మ్యాచ్‌ల గురించి కోచ్‌ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ చర్చించారు. మూడు రోజుల వార్మప్‌ కచ్చితంగా ఉండాలనుకున్నాం. సీనియర్లతో పాటు యువకులకు పిచ్‌ను అంచనా వేయడానికి అవకాశం దక్కింది’ అని చెప్పాడు.