NTV Telugu Site icon

AUS vs IND: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. కోచ్ గంభీర్‌కు హర్భజన్ కీలక సూచన!

Gautam Gambhir

Gautam Gambhir

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22న ప్రారంభం అవనుంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం అవుతుంది. న్యూజీలాండ్ చేతిలో దారుణ ఓటమి నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌కు కీలకంగా మారింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలన్నా.. ఆస్ట్రేలియాపై సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకోవాలి. ఆసీస్ జట్టుపై గెలుపు కోసం గౌతీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. గంభీర్‌కు కీలక సూచన చేశాడు. ఆసీస్ గడ్డపై భారత్ మెరుగైన ప్రదర్శన చేయాలంటే.. కోచ్ గంభీర్‌ ప్రశాంతంగా ఉండాలని సూచించాడు.

స్పోర్ట్స్ జర్నలిస్ట్ జతిన్ సప్రూ యూట్యూబ్ ఛానెల్‌లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ‘భారత్ లాంటి టాప్ జట్లకు కోచ్‌గా ఉండటం చాలా కష్టం. ఎవరైనా కుదురుకోవడానికి సమయం తీసుకుంటారు. ఫలితాలు బాగా వస్తే.. గంభీర్‌ టీమ్‌ని గెలిపిస్తున్నాడని అందరూ అంటారు. లేదంటే విమర్శలు చేస్తారు. ఆస్ట్రేలియాతో సిరీస్ ముఖ్యమైనది. చాలా అంశాలు పరీక్ష పెడుతాయి. గౌతీ కోపం, సహనాన్ని ఈ సిరీస్‌ పరీక్షిస్తుంది. గంభీర్‌ తన కోపాన్ని నియంత్రించుకోలేడు. ఇలా చేస్తే సీనియర్ ప్లేయర్స్ విసుగు చెందుతారు. కోపాన్ని నియంత్రించుకునే టెస్టులో గంభీర్ పాస్ కావాలి’ అని అన్నాడు.

Also Read: PL 2025 Auction: డబ్బు మ్యాటర్ కాదు.. ఢిల్లీని వీడటంపై స్పందించిన పంత్!

‘గౌతమ్ గంభీర్‌కు ఆస్ట్రేలియా పర్యటన చాలా కీలకం. ప్రతిఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం అందరి దృష్టి గౌతీపైనే ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా మెరుగ్గా ఆడకపోతే.. గంభీర్ అయిపోతాడు. విమర్శకులకు అతడు లక్ష్యంగా మారతాడు. గౌతీ ప్రశాంతంగా ఉండాలని, భారత జట్టు బాగా ఆడాలని నేను కోరుకుంటున్నా’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. గత రెండు పర్యాయాలు ఆసీస్ గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఈసారి ఎలాగైనా సిరీస్ కాపాడుకోవాలని ఆసీస్ చూస్తోంది.