Hyderabad: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!

Attapur Hyderabad

Attapur Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. థార్ కారులో నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై స్పందించిన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. ఆరాంఘర్ చౌరస్తా వరకు థార్ కారును చేజ్ చేసినప్పటికీ, నిందితులు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. నిందితులు ఉపయోగించిన కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో దర్యాప్తులో సవాళ్లు ఎదురవుతున్నాయి. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేలోని 143వ పిల్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడం వల్ల వివరాలు సేకరించడం కష్టతరంగా మారింది.

ఈ ఘటనలో యువతి నిజంగా కిడ్నాప్‌కు గురైందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు విచారణ కొనసాగించారు. ఇప్పటివరకు కిడ్నాప్‌కు గురైన యువతి ఎవరు అన్నది స్పష్టత రాలేదు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు కూడా అందలేదు. ఈ ఘటనను చూసిన స్థానికులు మాత్రం ఆ యువతిని థార్ కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారని చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం నగరంలో కలకలం సృష్టిస్తోంది.