NTV Telugu Site icon

Attack on Minister Office: మంత్రి విడదల రజినీ కార్యాలయంపై దాడి.. 30 మంది అరెస్ట్

Rajini

Rajini

Attack on Minister Office: ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు 30 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. మంత్రి కార్యాలయంపై దాడి చేసిన వారు టీడీపీ-జనసేన కార్యకర్తలు అని పోలీసులు తెలిపారు. గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలో మంత్రి రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆదివారం రాత్రి దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన వైసీపీ ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా దాడులను ఆపలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు.

Read Also: Ambati Rambabu: మంత్రి విడదల రజనీ ఆఫీసుపై టీడీపీ శ్రేణుల దాడి దుర్మార్గం

ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ… ‘అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండా తో జగనన్న పాలన సాగిస్తున్నారు. జగన్ ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్తగా పని చేస్తున్నాను. గుంటూరు అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తా. పశ్చిమలో ప్రతి ఒక్కరూ సొంత ఆడపడుచులా ఆదరిస్తున్నారు. గుంటూరు పశ్చిమలో వైసీపీ జెండా ఎగరవేయాలి. మన కార్యాలయంపై టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారు. రాళ్లతో మన కార్యాలయాన్ని పగలగొట్టారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమలో అలజడి సృష్టిస్తున్నారు. వైసీపీ కుటుంభం అప్రమత్తంగా ఉండాలి. రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి’ అని అన్నారు.

Read Also: Visakha: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

‘మాకు రౌడీ యిజం చేసే అలవాటు లేదు. అధికారం కోసం బీసీ మహిళపై దాడి చేస్తారా?. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మంత్రిగా ఉన్న బీసీ మహిళపై దాడులు చేస్తున్నారంటే.. అధికారం వస్తే టీడీపీ ఏం చేస్తుందో ప్రజలు ఆలోచించాలి. దాడి చేయటం పెద్ద పని కాదు కానీ మాది ఆ సంస్కారం కాదు. ప్రజల మనసులో వైసీపీకి స్థానం ఉంది. ప్రజా బలంతో వైసీపీ పశ్చిమలో విజయం సాధిస్తాం. మీరు భయపెడితే భయపడే రకం కాదు నేను’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ‘సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గుంటూరు పశ్చిమలో అభివృద్ధి చేసేందుకు ఏం చేయాలో అదే చేసాం. మా సొంత భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే టీడీపీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఒక బీసీ మహిళ ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించకూడదా?.. ఆ హక్కు మాకు లేదా?. మీ ప్రతాపం ఏదైనా ఉంటే ప్రజలకు మేలు చేయడంలో చూపించండి. అంతేకాని దాడులు చేసి బెదిరించాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం’ అని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.