NTV Telugu Site icon

ATM Withdraw: ఏటీఎం వాడేవారికి షాక్.. క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీలు మరింత పెంపు!

Atm

Atm

ATM Withdraw: ఏటీఎం (ATM) అనేది బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసే ఓ యంత్రం. ఇది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి నగదు విత్‌డ్రా చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేయడానికి, మినీ స్టేట్‌మెంట్ పొందడానికి, ఇతర బ్యాంకింగ్ సేవలు ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరిగినా ఇప్పటికీ చాలా మంది ఏటీఎంల ద్వారా నగదు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నగదు లావాదేవీలు పెరుగుతుండటంతో ఏటీఎంల వినియోగంపై కొత్త ఛార్జీలను అమలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సిద్ధమైంది. ఇందులో భాగంగా, మే 1 నుండి ఏటీఎంల నుంచి నగదు డ్రా చేయడానికైనా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికైనా అదనపు ఛార్జీలు వినియోగదారులకు పడనున్నాయి.

Read Also: Adah Sharma : బాక్సాఫీస్ కలెక్షన్ల గోల అవసరమా.. ఆదాశర్మ షాకింగ్ కామెంట్స్

వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచాలని కోరారు. ఈ ప్రతిపాదనను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆమోదించగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా ఆమోదం తెలిపింది. దీంతో కొత్త చార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఏటీఎం కొత్త చార్జీల విషయానికి వస్తే.. ప్రతి లావాదేవీకి క్యాష్ విత్‌డ్రాయల్ ఫీజును రూ.17 నుంచి రూ. 19 లకు పెంచారు. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ ఫీజును ప్రతి లావాదేవీకి రూ.6 నుంచి రూ.7 చేసారు. ఇక ఏ బ్యాంకు ఖాతాదారులు అయినా సరే మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు, నాన్-మెట్రో ప్రాంతాల్లో నెలకు 3 ఉచిత లావాదేవీలు చేయొచ్చు. ఈ పరిమితిని మించితే కొత్తగా నిర్ణయించిన ఛార్జీలు వర్తిస్తాయి. మీరు మీ బ్యాంకుకు చెందిన కార్డ్‌తో ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగిస్తే వాటిపై కూడా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Read Also: Shalini Pandey : స్టైలిష్ డ్రెస్ లో షాలినీ పాండే.. ఆ ఫోజులు చూశారా..

వీటి ప్రభావం చిన్న బ్యాంకులపై పడనుంది. ఆ బ్యాంకులకు తక్కువ ఏటీఎంలు ఉండటంతో, వాటి ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే తరచుగా ఏటీఎం వినియోగించే వారు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇలా నగదు లావాదేవీలకు చెల్లించే ఛార్జీలు పెరగడంతో ప్రజలు డిజిటల్ లావాదేవీల వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశముంది.