NTV Telugu Site icon

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసిన వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కలిశారు. ఏపీ, తెలంగాణ,పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు పవన్‌ను కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను డెప్యూటీ సీఎంకు వివరించారు. క్రీడలతో సంబంధం లేని వారికి క్రీడా సంఘాలు అందించొద్దని వినతి పత్రాన్ని అందించారు. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోయాయని పవన్ వద్ద క్రీడాకారులు వాపోయారు. క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికేట్లు అంగడి సరుకుగా మారిపోయాయని పవన్‌కు తెలిపారు. ఎటువంటి క్రీడానుభవం లేనివారు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని పవన్ దృష్టికి క్రీడాకారులు తెచ్చారు. క్రీడా సంఘాలలో తిష్టవేసిన రాజకీయ నేతల వల్ల క్రీడాకారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. తమ బంధువులు, సన్నిహితుల పిల్లలను కొందరు రాజకీయ నేతలు అధికార దర్పంతో ఎంపిక చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Minister Ramprasad Reddy: మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతాం..

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీలయ్యాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయని ఆయన విమర్శించారు. ఏపీలో క్రీడారంగం కూడా అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు, తాను ప్రయత్నిస్తున్నామన్నారు. క్రీడాకారుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం క్రీడా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. క్రీడలకు వైభవాన్ని తప్పకుండా తీసుకు వస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.