Site icon NTV Telugu

Crime News: మహిళను హత్య చేసి.. ఆమె 10 నెలల శిశువును కిడ్నాప్ చేసి..

Assam

Assam

Crime News: అస్సాంలో దారుణం జరిగింది. ఎగువ అస్సాంలో మహిళను హత్య చేసి, ఆమె 10 నెలల శిశువును కిడ్నాప్ చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితుల్లో దంపతులు, వారి కుమారుడు, బాధితురాలి తల్లి ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో అరెస్టయిన దంపతులు సంతానం లేని తమ కుమార్తెకు శిశువును అప్పగించేందుకు ప్రయత్నించారు.

కెందుగురి బైలుంగ్ గ్రామానికి చెందిన నిటుమోని లుఖురాఖోన్ అనే మహిళ మృతదేహాన్ని మంగళవారం ఉదయం చరైడియో జిల్లాలోని రాజబారి టీ ఎస్టేట్ వద్ద కాలువ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం సిమలుగురిలోని మార్కెట్ నుంచి మహిళ కనిపించకుండా పోయింది. సిమలుగురి, శివసాగర్, చరైడియో, జోర్హాట్ నుంచి పోలీసు బృందాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి జోర్హాట్‌లోని ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్‌ నుంచి శిశువును రక్షించారు.

అసలేం జరిగిందంటే.. ఏదో పనిసాకుతో నిటుమోని లుఖురాఖోన్ అనే మహిళను తెంగాపుఖురికి చెందిన ప్రణాలి గొగోయ్, బసంత గొగోయ్‌ దంపతులు ఇంటికి ఆహ్వానించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటున్న తమ వివాహిత కుమార్తెకు పిల్లలు లేని కలను నెరవేర్చడానికి గొగోయ్ దంపతులు ముందుగానే ఆమె శిశువును లాక్కోవడానికి పన్నాగం పన్నారు. దీనికి బాధితురాలి తల్లి కూడా సహకరించింది. ఆ దంపతుల కుమారుడు కూడా ఇందులో భాగమయ్యాడు. పని కోసమని నిటుమోని ఆ ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే ఆ మహిళ శిశువును లాక్కోవడానికి ప్రయత్నించారు. నిటుమోని ప్రతిఘటించడంతో .. ఆ జంట ఆమెపై మొద్దుబారిన వస్తువుతో దాడి చేసి చంపింది. ఆ శవాన్ని టీ ఎస్టేట్‌లో పడేశారు. టీ ఎస్టేట్‌ వద్ద మృతదేహం కనిపించగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

Bharat Jodo Yatra: అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు యాత్రను నిలిపివేసిన రాహుల్

అనంతరం శిశువును హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుమార్తె వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గొగోయ్ దంపతుల కుమారుడు శిశువును తీసుకుని రైలు ఎక్కాడు. మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిశువుతో పాటు రైలులోకి ఎక్కిన గొగోయ్ దంపతుల కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటున్న తమ వివాహిత కుమార్తెకు పిల్లలు లేని కలను నెరవేర్చడానికి గొగోయ్ దంపతులు ఈ నేరానికి పాల్పడ్డారని శివసాగర్ సీనియర్ పోలీసు అధికారి సుభ్రజ్యోతి బోరా తెలిపారు. నలుగురు నిందితులను స్థానిక కోర్టు పోలీసు కస్టడీకి పంపింది.

Exit mobile version