ఆసియా కప్ 2025 ఈరోజు యూఏఈలో ఆరంభం కానుంది. అబుదాబిలో రాత్రి 8 గంటలకు హాంకాంగ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, యూఏఈ ప్లేయర్స్ సాధన చేస్తున్నారు. మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్‌తో తనకున్న అనుబంధాన్ని యూఏఈ బౌలర్ సిమ్రన్‌జిత్ సింగ్ గుర్తుచేసుకున్నాడు. గిల్ చిన్నప్పటి నుంచే తనకు తెలుసు అని.. కానీ ఇప్పుడు అతడికి నేను గుర్తున్నానో లేదో తెలియదు అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
‘శుభ్‌మన్ గిల్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ అతడికి నేను గుర్తున్నానో లేదో తెలియదు. 2011-12లో గిల్‌కు 11 లేదా 12 ఏళ్లు ఉంటాయి. మేము ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) అకాడమీలో శిక్షణ పొందేవాళ్లం. గిల్ తన తండ్రితో కలిసి ప్రాక్టీస్‌కు వచ్చేవాడు. మా సెషన్ అనంతరం కూడా చాలా సమయం నేను బౌలింగ్ చేసేవాడిని. ఆ సమయంలో నేను గిల్‌కు బౌలింగ్ చేశాను. ఇప్పుడు అతడు నన్ను గుర్తుపడతాడో లేదో తెలియదు’ అని సిమ్రన్‌జిత్ సింగ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగే మ్యాచ్ సిమ్రన్‌జిత్‌కు అంతర్జాతీయ మ్యాచ్ కంటే ఎక్కువ అని చెప్పాలి.
‘నేను ఏప్రిల్ 2021లో 20 రోజుల ప్రాక్టీస్ కోసం దుబాయ్ వచ్చాను. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో మరోసారి లాక్‌డౌన్ విధించారు. దీంతో నేను నెలల తరబడి ఇక్కడే ఉండిపోయాను. క్లబ్ క్రికెట్ ఆడుతూ జూనియర్లకు శిక్షణ ఇచ్చాను. యూఏఈ తరఫున అర్హత సాధించడానికి మూడు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడాను. చివరకు యూఏఈ బోర్డుతో ఒప్పందం కుదిరింది’ అని సిమ్రన్‌జిత్ సింగ్ చెప్పాడు. సిమ్రన్‌జిత్ పంజాబ్‌లో జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడాడు. 2017లో రంజీ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. అది పెద్దగా కలిసిరాలేదు. కరోనా సమయంలో ప్రాక్టీస్ కోసం దుబాయ్ వెళ్లడం అతడికి కలిసొచ్చింది.
