Asia Cup 2025 India Squad: యూఏఈ వేదికగా 2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆగస్టు 19 లేదా 20న భారత జట్టును ప్రకటించే అవకాశముంది. ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత్ బరిలో దిగడం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ అటుంచితే.. శుభ్‌మన్ గిల్‌కు చోటు కూడా దక్కకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
టీ20 జట్టులో ప్రయోగాలు చేయడానికి బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించినా.. ఆసియా కప్ 2025లో మాత్రం ఆడే అవకాశం దక్కకపోవచ్చని సమాచారం. ఇటీవలి రోజుల్లో అన్ని ఫార్మాట్లకు గిల్‌నే కెప్టెన్‌గా చేస్తారనే వార్తలొచ్చాయి కానీ.. ప్రస్తుతానికి సారథ్య మార్పు ఉండకపోవచ్చని సమాచారం. స్టార్స్ యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు స్థానం అనుమానమే. జైస్వాల్‌ను టెస్టు క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరించమని బీసీసీఐ సెలక్టర్లు కోరారట.
భారత టీ20 జట్టులో ప్రస్తుతం సంజు శాంసన్, అభిషేక్‌శర్మలు ఓపెనర్లుగా రాణిస్తున్నారు. తిలక్‌వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. కీపర్స్ జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఆపై ఆల్‌రౌండర్‌లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. కృనాల్ పాండ్యా పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో పెద్దగా ప్రభావం చూపించని రింకు సింగ్‌కు కూడా ఆసియా కప్‌లో అవకాశం కష్టమే. అలానే ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్ కూడా డౌటే. మొత్తానికి ఐదుగురు స్టార్స్‌కు చోటు కష్టంగానే కనిపిస్తోంది. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఆడడం ఖాయం. మూడో సీమర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్ విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని రోజులు ఆగితే.. ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుపై పూర్తి స్పష్టత రానుంది.
