Kuldeep Yadav React on 5 Wicket Haul vs Pakistan: ఆసియా కప్ 2023 సూపర్ -4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. 357 పరుగుల లక్ష ఛేదనలో పాక్ 128 పరుగులకే పరిమితమైంది. దాంతో భారత్ 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో బలమైన పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్ చేయడంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ 8 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ క్రికెట్ నుంచి దూరమైనప్పటికీ ఇలాంటి స్పెల్ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోతుంది అని చెప్పాడు.
పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఈ ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. చెప్పడానికి మాటలు రావడం లేదు. గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి నేను నిలకడగా రాణిస్తున్నా. నేను నా లయను తిరిగి పొందాను. ఇప్పుడు నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నా. ఐదు వికెట్లు తీయడం చాలా బాగుంది. నేను మంచి లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం గురించే ఎప్పుడూ ఆలోచిస్తున్నాను. అత్యుత్తమ జట్టుపై ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. తప్పకుండా ఈ స్పెల్ జీవితాంతం గుర్తుండిపోతుంది. క్రికెట్‌కు వీడ్కలు పలికినా ఈ స్పెల్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైందే’ అని అన్నాడు.
Also Read: Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. కారణం రవీంద్ర జడేజా! వీడియో వైరల్
‘పాక్‌పై ఐదు వికెట్లు తీయడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే స్పిన్‌ను బాగా ఆడగలిగే ఉపఖండ జట్టుపై ఇలాంటి ప్రదర్శన చేయడం వల్ల నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంపై దృష్టి పెడుతున్నా. బ్యాటర్లు స్వీప్ లేదా స్లాగ్ స్వీప్ చేయడానికి ప్రయత్నించినపుడు వికెట్లు పడే అవకాశాలు ఉంటాయి. ఫిట్‌నెస్‌పై దృష్టిసారించా. ఐపీఎల్ సమయంలోనూ చాలా కష్టపడ్డా’ కుల్దీప్ యాదవ్ చెప్పాడు. 2017లో వన్డేల్లోకి అడుగుపెట్టిన కుల్దీప్.. 87 వన్డేల్లో 146 వికెట్లు తీశాడు. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ 2023లోనూ అతడు స్థానం సంపాదించాడు. ప్రపంచకప్‌లో కూడా కుల్దీప్ తుది జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.