Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..

Vaibhav

Vaibhav

భారత క్రికెట్‌ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ గాయపడటంతో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. అయితే అతడిని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం సరైన నిర్ణయం కాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ స్థానంలో వైభవ్ నీటిలోంచి బయటకు వచ్చిన చేపలా తీవ్ర ఇబ్బంది పడ్డాడని, 8 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడని పేర్కొన్నాడు.

వైభవ్ ఇంకా చాలా చిన్న వయస్కుడని, అతడికి ఇష్టమైన ఓపెనింగ్ స్థానం కాకుండా ఆరో ఓవర్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దించడం వల్ల ఒత్తిడికి లోనయ్యాడని అశ్విన్ అన్నాడు. క్రీజులో ఉన్నప్పుడు బంతిని సరిగ్గా టైమింగ్ చేయలేకపోయాడని, ఇలాంటి సమయంలో మైదానంలో ఉన్న సీనియర్ ఆటగాడు అతడి వద్దకు వెళ్లి శాంత పరచాల్సిందని చెప్పాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మైండ్ డైవర్ట్ కాకుండా బంతిని నిశితంగా గమనించమని చెప్పే సీనియర్ తోడ్పాటు అతనికి లభించలేదని అభిప్రాయపడ్డాడు.

టీమిండియా మేనేజ్‌మెంట్‌కు అశ్విన్ ఒక కీలక సూచన చేశాడు. అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, వైభవ్ సూర్యవంశీ ముగ్గురూ తుది జట్టులో ఆడాల్సి వస్తే.. వైభవ్‌ను కాకుండా సంజూ శామ్సన్‌ను మూడో స్థానానికి పంపడమే సరైన వ్యూహమని పేర్కొన్నాడు. ఆసియా గేమ్స్‌లో సంజూ వన్ డౌన్‌లో ఆడిన అనుభవం ఉందనే విషయాన్ని గుర్తుచేశాడు.

అదే సమయంలో భారత మిడిల్ ఆర్డర్ ప్రదర్శనను అశ్విన్ కొనియాడాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్ చూపిన తెగువను అభినందించాడు. 6, 7, 8 స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు చాలా ప్రమాదకరంగా మారుతున్నారని, మిచెల్ శాంట్నర్ లాంటి అగ్రశ్రేణి స్పిన్నర్లను సైతం నమన్ ధీర్ సిక్సర్లు కొట్టడం అతడి నైపుణ్యానికి నిదర్శనమని పొగిడాడు. తిలక్ వర్మ నిలకడైన ప్రతిభను చూపిస్తున్నాడని, ఈ మిడిల్ ఆర్డర్ ఇతర జట్లకు సవాలుగా మారనుందని అశ్విన్ విశ్లేషించాడు.