కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడి ఎన్నిక మరింత ఆసక్తిగా మారింది. అధ్యక్ష పదవి రేసులోకి మరో సీనియర్ నేత వచ్చారు. తానూ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. ఇందుకు రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ వేసేందుకు రేపే చివరి రోజు. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక జరగనుంది.
సోనియా గాంధీతో భేటీ అయిన తర్వాత ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్లు అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. దీంతో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ మధ్యే పోటీ జరగనుంది. శశిథరూర్ కూడా రేపే నామినేషన్ వేయనున్నారు. అశోక్ గెహ్లాట్ మాదిరే దిగ్విజయ్ సింగ్ కు కూడా ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడిగా మెలిగారు. దిగ్విజయ్ సింగ్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. మాజీ ఎంపీ అర్జున్ సింగ్ సహాయంతో రాజకీయాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దిగ్విజయ్‌ను రాజకీయ గురువుగా పరిగణిస్తారు.
దిగ్విజయ్ సింగ్ 1969లో రఘోఘర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా రాజకీయాలను ప్రారంభించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రాజీవ్ గాంధీ కాలం నుండి గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వసనీయ వ్యక్తులలో దిగ్విజయ్ సింగ్ ఒకరు. సోనియాగాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని భావిస్తున్నారు.
దిగ్విజయ్ సింగ్ 1993 నుండి 2003 వరకు మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేశారు. 2003 ఎన్నికల్లో ఓడిన తర్వాత, పదేళ్లపాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయింది. వివాదాస్పదుడైన దిగ్విజయ్ పోటీలో నెగ్గితే.. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితాలు తెచ్చిపెడతాయో వేచి చూడాల్సిందే.
అధ్యక్ష ఎన్నికల్లో తమ జోక్యం ఉండదని గాంధీ కుటుంబం పదే పదే చెబుతున్నప్పటికీ.. ఆ కుటుంబం మద్దతు ఉన్న నాయకుడే ఆ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దిగ్విజయ్, శశిథరూర్‌తో పాటు ఇంకెవరైనా నాయకులు రేసులో ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్ష రేసు మరింత సంక్లిష్టంగా మారుతుందనే చర్చ జరుగుతోంది.