Site icon NTV Telugu

Ashok Gehlot: రాజస్థాన్‌లో రాజకీయ రగడ.. సోనియాగాంధీని కలవనున్న అశోక్‌ గెహ్లాట్

Ashok Gehlot

Ashok Gehlot

Ashok Gehlot: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ రగడ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ముందుగా అనుకున్న విధంగా గెహ్లాట్ నామినేషన్‌పై స్పష్టత కొరవడిన క్రమంలో పార్టీ అధినేత్రి సోనియాతో భేటీకి ప్రాధాన్యత నెలకొంది. గెహ్లాట్‌ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడితే తదుపరి ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ను ఎంపిక చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆదివారం 80 మందికి పైగా గెహ్లాట్‌ వర్గానికి చెందిన శాసనసభ్యులు సభాపతి సీపీ జోషికి రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. సోనియా గాంధీతో భేటీ కోసం రాజస్థాన్ ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది.

జులై 2020లో గ‌తంలో పార్టీపై తిరుగుబాటు చేసిన స‌చిన్ పైల‌ట్‌కు రాజ‌స్థాన్‌ సీఎం ప‌ద‌విని అప్పగిస్తే ఊరుకునేది లేద‌ని తెగేసి చెప్పారు. సీఎంగా గెహ్లాట్‌ సూచించిన వ్యక్తినే ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. రాజ‌స్దాన్‌లో రాజ‌కీయ ప‌రిణామాల‌ను చ‌క్కదిద్దేందుకు, గెహ్లాట్‌, పైల‌ట్ వ‌ర్గాల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు పార్టీ ప‌రిశీల‌కులుగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, అజ‌య్ మాకెన్‌ల‌ను కాంగ్రెస్ నియ‌మించింది. వారిద్దరూ పార్టీ వ్యవహారాల‌పై ఇప్పటికే సోనియా గాంధీకి లిఖిత‌పూర్వక నివేదిక అందించ‌గా మ‌రోవైపు మ‌ధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్‌కు సైతం రాజ‌స్ధాన్ ప‌రిణామాల‌ను చ‌క్కదిద్దే బాధ్యత‌ను పార్టీ అప్పగించింది. ఈ ప‌రిణామాల నేప‌ధ్యంలో అశోక్ గెహ్లాట్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో స‌మావేశం కానుండ‌టం ప్రాధాన్యత సంతరించుకుంది.

Exit mobile version