NTV Telugu Site icon

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ రైజ్ అండ్ ఫాల్..! అవినీతికి వ్యతిరేకం అని.. అదే ఊబిలో కూరుకుపోయి..!

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: జన్‌లోక్‌పాల్‌ అన్నాడు! అవినీతికి వ్యతిరేకం అన్నాడు! చివరికి అదే అవినీతి ఊబిలో కూరుకుపోయాడు! అది 2011 సంవత్సరం. ఢిల్లీ జంతర్‌మంతర్‌. అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్‌ వ్యవస్థను తీసుకురావాలని అన్నాహజారే దీక్ష చేస్తున్న రోజులవి. అదే వేదికపై పెద్దసైజు కళ్లద్దాలు పెట్టుకొని, ఓ వ్యక్తి అటూఇటూ హడావిడిగా తిరుగుతున్నాడు. సగటు మధ్యతరగతి మనిషిలా ఉండే, ఆ మిడల్ ఏజ్డ్ పర్సన్ మీడియాను ఆకర్షించాడు. యువకులను ఆలోచింపజేశాడు. సీనియర్ సిటిజన్ల దృష్టిలో పడ్డాడు. ఆయనే అరవింద్ కేజ్రీవాల్. అన్నా హజరే ఉద్యమం కేజ్రీవాల్ అనే పర్సనాలిటీని ఎక్స్‌ప్లోర్ చేసింది. ఆ రోజుల్లో ఆయన ప్రతీమాట ఒక తూటాలాగా పేలింది! మీడియా ముందుకు వస్తున్నాడూ అంటే ఏదో సంచలన వార్త తీసుకొస్తాడనే పేరుండేది. అవినీతి వ్యతిరేక భావజాలం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆ టైంలో కేజ్రీవాల్ ఆశాకిరణంలా కనిపించాడు. ఒక బ్యూరోక్రాట్.. వ్యవస్థలో ఉన్న కరప్షన్ గురించి మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యవాదులు సంతోషం వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్ నారాయణ్‌ తరహాలో దేశానికి ఆదర్శవంతంగా మారుతాడని ఆకాంక్షించారు.

Read Also: Delhi Election Results: విజయోత్సవ సంబరాల్లో డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి

ఆ క్రమంలోనే మఫ్లర్ వాలా ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పాడు. చీపురుపట్టి అవినీతిని ఊడ్చి పడేస్తానని మాటిస్తే, అందరూ గొంతు కలిపారు. ఢిల్లీ ఓటర్లకు దేశంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ. ఉద్యోగస్తులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన వారంతా ఉంటారు. దాంతో ఇది సహజంగానే చైతన్యవంతమైన ప్రాంతంగా ఉంటుంది. ఢిల్లీ ప్రజల అప్రోచే వేరు! చాలా ఫెరోషియస్‌గా ఉంటారు. ఏ విషయాన్నైనా కట్‌థ్రోట్‌గా మాట్లాడుతారు! అందరూ లైక్‌ మైండెట్ పీపుల్‌ కావడంతో, కేజ్రీవాల్ అతితక్కువటైంలో పార్టీ ప్రకటించాడు. అంతలోనే ఎన్నికలు రానేవచ్చాయి. 2013లో మొత్తం 70 సీట్లకు పోటీ చేస్తే ఏకంగా 28 సీట్లు గెలుచుకున్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే కొద్దికాలానికే సర్కారు పడిపోవడంతో 2015లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. సెకండ్ టైం ఏకంగా 67 సీట్లు గెలిచారు. ఐదేళ్లు గడిచాయి. తరువాత 2020లో జరిగిన ఎన్నికల్లోనూ అదే తరహా ప్రభంజనం. అప్పుడు 62 సీట్లు గెలుచుకున్నారు. మూడుసార్లు సీఎం అయ్యాడు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

కట్ చేస్తే.. ఏ అవినీతికి వ్యతిరేకంగానైతే ఉద్యమించాడో అదే అవినీతి కూపంలో కేజ్రీవాల్ పీకల్లోతు కూరుకుపోయాడు. మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఈ ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా లిక్కర్ కుంభకోణం పార్టీని ఎత్తికుదేసింది. మంత్రులతో పాటు సీఎంగా ఉన్న కేజ్రీవాల్‌ కూడా జైలుకు వెళ్లాల్సివచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఒక పార్టీ.. అదే ఆరోపణల్లో కూరుకుపోవడంతో మీడియాలో, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చజరిగింది. కరప్షన్‌ని కూకటివేళ్లతో పెకిలిస్తామని వచ్చి పార్టీ పెట్టిన కేజ్రీవాల్‌.. అదే అవినీతి కూపంలో మునిగిపోయాడని ఆరోపణలు రావడంతో జనం విసుగెత్తిపోయారు. అన్ని రాజకీయాపార్టీలు అవినీతికి కేరాఫ్ అని ఢంకా బజాయించి చెప్పిన ఈ మాటకారి.. తన పార్టీ విషయంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు మూటగట్టుకున్నాడు. అధికార నివాసం శీష్ మహల్‌ను కోట్ల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్టు వచ్చిన కాగ్‌ నివేదిక బీజేపీకి మరో ఆయుధంలా దొరికింది. లిక్కర్ స్కాం మూలాలు దేశమంతా ఉండటం కూడా కమలం పార్టీకి కలిసొచ్చింది. చివర్లో యుమునానది వాటర్ విషయాన్ని ఆప్ తెరమీదికి తెచ్చింది. హర్యానా సర్కారు అందులో విషం కలుపుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. చివర్లో సీఎం పదవిని మహిళకు ఇచ్చామని చెప్పుకున్నా, ఆ ఫ్యాక్టర్ కూడా ఓట్లు రాబట్టలేకపోయింది. ఇందాక చెప్పుకున్నాం కదా.. ఢిల్లీ ఓటర్లలో చైతన్యం ఎక్కువ అని. అదే జరిగింది. ఇన్నాళ్లూ ఏం జరిగిందో అర్ధం చేసుకోడానికి, వారికి పెద్దగా టైం పట్టలేదు. సైలెంటుగా చీపురుని తీసి మూలకు పెట్టారు. ఎంతగా అంటే.. కేజ్రీవాల్‌ని కూడా ఓడించారు. సర్కారు వ్యతిరేక ఓటు గంపగుత్తగా వెళ్లి ప్రతిపక్ష బీజేపీని గెలుపు తీరాన నిలబెట్టింది. దేశంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రధాన ప్రతిపక్షం స్థానంలో పార్టీని తీర్చిదిద్దాలని ఆశించిన కేజ్రీవాల్‌.. ఢిల్లీ గడ్డమీద ఘోరంగా బోల్తా కొట్టారు. ఎంత వేగంగా రాజకీయాల్లో ఆకాశానికి ఎదిగాడో.. అంతే వేగంగా పాతాళానికి పడిపోయాడు. ఇదీ కేజ్రీవాల్ రెయిజ్ అండ్ ఫాల్! వైకుంఠపాళిలో నిచ్చెనలే కాదు.. పాములు కూడా ఉంటాయి! అందుకు రాజకీయమేం అతీతం కాదు.