NTV Telugu Site icon

PM Narendra Modi: శంకుస్థాపన ఎన్నికల జిమ్మిక్కు అన్నారు.. ఇది వారికి గట్టిదెబ్బ

Green Field Airport

Green Field Airport

PM Narendra Modi: అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో దోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్, ఎంపీ నబమ్ రెబియా కూడా పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌ను ప్రధాని మోడీ తమ చేతులమీదుగా ప్రారంభించి.. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ విమానాశ్రయంతో టూరిజంను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు 645 కోట్ల ఖ‌ర్చుతో డోనీ పోలో విమానాశ్రయాన్ని నిర్మించింది. గంట‌కు 200 ప్రయాణికుల్ని హ్యాండిల్ చేయ‌గ‌ల‌దు. మొత్తం ఎనిమిది చెక్ ఇన్ కౌంట‌ర్లు నిర్మించారు. 2300 మీట‌ర్ల ర‌న్‌వే ఉంది. బోయింగ్ 747 విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుకూలంగా విమానాశ్రయాన్ని నిర్మించారు.

ఈశాన్య రాష్ట్రం పశ్చిమ కమెంగ్ జిల్లాలో 600 మెగావాట్ల కమెంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును కూడా ప్రధాని నరేంద్ర మోదీ శ‌నివారం జాతికి అంకితం చేశారు. రూ.8,450 కోట్లకు పైగా వ్యయంతో 80 చద‌ర‌పు కిలోమీట‌ర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కమెంగ్ జలవిద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుస్తుందని మోదీ అన్నారు. “కనెక్టివిటీ, ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ధి కొత్త పుంత‌లు తొక్కుతుంది” అని ప్రారంభోత్సవ స‌భ‌లో మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు. “విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం ఎన్నికల జిమ్మిక్కు అని 2019లో రాజకీయ విమ‌ర్శలు చేశారు. కానీ ఈ రోజు ఎన్నికలు లేవు, మేము ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నాం” అని ప్రధాని ప్రతిప‌క్షాల‌నుద్దేశించి మాట్లాడారు. ఈ కొత్త ప్రాజెక్టులతో దాదాపు 20 లక్షల మందికి సేవలంద‌డంతోపాటు, కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటక అభివృద్ధికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మోదీ చెప్పారు.

Traffic Rules : ట్రాఫిక్ పోలీస్ కొత్త రూల్స్.. రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా

ఏడాదికి 365 రోజులు, 24 గంటలూ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. స్వాతంత్య్రానంతరం ఈశాన్య ప్రాంతాలు భిన్నమైన యుగానికి సాక్ష్యమిచ్చాయని ప్రధాని అన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోందనీ, అటల్ జీ ప్రభుత్వం వచ్చాక తొలిసారి ఈ ప్రాంతంలో మార్పు ప్రారంభమైందనీ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం ఇదేననీ, ప్రస్తుత ప్రభుత్వం కూడా దేశంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేయడం లక్యంగా పెట్టుకుందన్నారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తన స్వాగత ప్రసంగంలో.. ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించడం అరుణాచల్ ప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంచడానికి ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందన్నారు. రాష్ట్ర రాజధాని నగరంలో విమానాశ్రయం ఉండాలనే కల ఈ రోజు సాకారమవుతోందని ఆయన అన్నారు. ఈ రోజు మొత్తం రాష్ట్రానికి చారిత్రాత్మకమైన రోజు అని ముఖ్యమంత్రి పెమా ఖండూ అన్నారు. ఈ విమానాశ్రయం కనెక్టివిటీని పెంచదు, కానీ ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.