NTV Telugu Site icon

Artisans Strike: సమస్యలు పరిష్కరించాలని 25 నుంచి ఆర్టిజన్ల సమ్మె!

Artisans Strike

Artisans Strike

Artisans Strike: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ సమ్మెకు రెండు సంఘాలు మద్దతు తెలుపుతుండగా.. కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్‌(హెచ్‌-82)తో పాటు మరో సంఘం మద్దతు ప్రకటించాయి. తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(హెచ్‌-82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఎస్మా కింద పంజాగుట్ట పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు తెలిసింది. దీనిపై యూనియన్‌ నేతలు మండిపడ్డారు. సమ్మె పిలుపు నేపథ్యంలో యూనియన్‌ నాయకులను రెండురోజులుగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని హెచ్‌-82 యూనియన్‌ అధ్యక్షుడు మధుకుమార్‌ ఆరోపించారు. ఈ చర్యలను యూనియన్‌ తీవ్రంగా ఖండిస్తుందని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రూ.12,600 బేసిక్‌పై 7శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి, హెచ్‌ఆర్‌ఏలో 6శాతం కోత విధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆర్టిజన్లు సమ్మె కొనసాగిస్తారని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లో ఐడీ నంబర్‌ కలిగిన కార్మికులందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయూస్ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్‌ చేశారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఆర్టిజన్‌ కార్మికులకు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ రద్దు చేసి ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓ అండ్‌ ఎం ఉద్యోగులు, ఆర్టిజన్లు ఒకే రకమైన పనులు చేసినప్పుడు ఒకే రకమైన రూల్స్ ఉండాలని.. కానీ యాజమాన్యం 2020 లో ఇండస్ట్రియల్ యాక్ట్-1947 ప్రకారం స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల వేతనాల్లో వ్యత్యాసం వచ్చిందని ఆయన మండిపడ్డారు. ఓ అండ్‌ ఎం ఉద్యోగస్తులకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్‌ అమలు చేయడం వల్ల ఆర్టిజన్లకు చాలా అన్యాయం జరిగిందన్నారు.

Read Also: Harish Rao : అవి పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్‌లు

ఆర్టిజన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని.. ఈ అరెస్టులను యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. యూనియన్‌ యాజమాన్యంతో తమ న్యాయమైన డిమాండ్లపై చర్చించడానికి సిద్ధంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా పిలిచి తాము ప్రతిపాదించిన న్యాయమైన డిమాండ్లను చర్చించి ఆర్టిజన్‌ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా సమ్మె ఆగదని వారు హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు పోరాడుతామని తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ హెచ్చరించింది.