Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!

  • వెస్టిండీస్‌తో మూడో టీ20లో 3 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్..
  • ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కైవసం..
  • గత మ్యాచ్‌లో బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదని కీలక వ్యాఖ్యలు..
Arshdeep Singh

Arshdeep Singh

Arshdeep Singh: ఇండోర్‌లో అర్ష్‌దీప్ సింగ్ అదిరిపోయే బౌలింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 44 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. మ్యాచ్ అనంతరం తన బౌలింగ్, గత మ్యాచ్‌లో ఎదురైన వైఫల్యం, టీ20 క్రికెట్‌లో మానసిక బలం గురించి అర్ష్‌దీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

వెస్టిండీస్‌తో మూడో టీ20లో అర్ష్‌దీప్ బంతితో చెలరేగాడు. అయితే గత మ్యాచ్‌లో తన బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదని చెప్పాడు. అందుకే ఈసారి జట్టు కోసం మెరుగ్గా రాణించాలనే పట్టుదలతో బరిలోకి దిగినట్లు వెల్లడించాడు. ఇండోర్ పరిస్థితులపై మాట్లాడుతూ.. బంతి కొంత రివర్స్ స్వింగ్ అయిందని, ముఖ్యంగా డెత్ ఓవర్లలో బంతి రివర్స్ అవుతుంటే బౌలింగ్ చేయడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాడు. మంచు ఉన్న పరిస్థితుల్లోనూ బౌలింగ్ చేయడం తనకు ఇష్టమేనని తెలిపాడు. గత మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేయలేకపోయానని, ఈసారి జట్టు కోసం మంచి ప్రదర్శన చేయాలని భావించానని.. అందుకు తగిన ఫలితం వచ్చిందని పేర్కొన్నాడు.

బౌలింగ్ యూనిట్‌లో కీలక ఆటగాడిగా ఉంటూ ఒక మ్యాచ్‌లో విఫలమైన తర్వాత ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు అర్ష్‌దీప్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. జట్టులో లీడర్, సీనియర్ అనే తేడా లేకుండా అందరూ ఒకరికొకరు అండగా ఉంటారని చెప్పాడు. ఎవరైనా ఆటగాడు విఫలమైనప్పుడు అతడు జట్టులో ఎంతో ముఖ్యమైన సభ్యుడని గుర్తు చేస్తూ మద్దతుగా నిలుస్తామని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఉన్నప్పుడు మంచి రోజులు, చెడు రోజులు రెండూ ఉంటాయని అర్ష్‌దీప్ అన్నాడు. “ప్రశాంతంగా ఉన్నంతకాలం తిరిగి వచ్చి మళ్లీ మంచి ప్రదర్శన చేయగలం” అనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

టీ20ల్లో బ్యాటర్లు తొలి ఓవర్లలో, డెత్ ఓవర్లలో భారీ షాట్లకు ప్రయత్నించడం తనకు నచ్చుతుందని అర్ష్‌దీప్ చెప్పాడు. అదే బౌలర్‌కు అసలైన సవాల్ అని పేర్కొన్నాడు. ఆ సమయంలో తన నైపుణ్యాలను, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని, మానసిక బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుందని తెలిపాడు. ఇంకా టీ20 క్రికెట్‌లో వరుస మ్యాచ్‌లు, మారుతున్న పరిస్థితులకు త్వరగా అలవాటు పడటం ఎంతో ముఖ్యమని అర్ష్‌దీప్ చెప్పాడు. కొత్త బంతితో, పాత బంతితో బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టడంతో పాటు వీలైనంతగా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని పేర్కొన్నాడు. షెడ్యూల్ ఎప్పుడూ బిజీగా ఉంటుందని.. అందుకే పరిస్థితులకు త్వరగా అనుగుణంగా మారాల్సి ఉంటుందని, పరిస్థితులకు త్వరగా అలవాటు పడే జట్టే ఎక్కువగా విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా కూడా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించాడు.