Arshad Nadeem Claims Historic Gold Meal: ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో హర్షద్.. ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బంగారు పతకం రేసులో ఉన్న అండర్సన్ పీటర్సన్, జులియెస్ యెగో, జాకబ్ వాద్లెచ్, నీరజ్ చోప్రాలను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన అర్షద్.. రెండో ప్రయత్నంలో మాత్రం ఒలింపిక్స్ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేశాడు.
పురుషుల జావెలిన్ త్రోయర్ క్వాలిఫికేషన్‌లో 89 మీటర్లు కూడా విసరని అర్షద్ నదీమ్.. ఫైనల్లో మాత్రం రెండుసార్లు ఈటెను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరడం విశేషం. 27 ఏళ్ల అర్షద్ ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి.. ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను అత్యధిక దూరం విసిరిన భల్లెం వీరుడుగా రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు నార్వే అథ్లెట్ ఆండ్రియాస్ తొర్కిల్‌డ్సెన్ పేరిట ఉంది. బీజింగ్ ఒలింపిక్స్ 2008లో ఆండ్రియాస్ ఈటెను 90.57 మీటర్లు విసిరాడు.
Also Read: Hockey India: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం.. ఆటగాళ్లకు ‘హాకీ ఇండియా’ నజరానా!
ఈటెను 92.97 మీటర్లు విసిరిన అర్షద్ నదీమ్‌కు ఇదే వ్యక్తిగత రికార్డ్ కావడం విశేషం. ఒలింపిక్స్ చరిత్రలోనే పాకిస్తాన్ తరపున వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి అథ్లెట్‌గా అర్షద్ నిలిచాడు. అంతేకాదు పారిస్ ఒలింపిక్స్‌లో పాక్ గెలిచిన ఏకైక పతకం ఇదే కావడం గమనార్హం. ఈ గోల్డ్ మెడల్ పాకిస్తాన్‌కు మాత్రమే కాదు.. అర్షద్ కుటుంబానికి కూడా ప్రత్యేకం అని చెప్పాలి. అర్షద్ తండ్రి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. కడు పేదరికంలో పాక్ అథ్లెట్ కుటుంబం ఉంది.