Chandrababu Swearing Ceremony: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున.. ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని అధికారులు, టీడీపీ నేతలు పరిశీలించారు. కానీ ఆ ప్రాంతం అంత అనువుగా లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏర్పాట్లకు కావాల్సిన సామాగ్రిని కూడా సిద్ధం చేశారు అధికారులు. సభా వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామాగ్రిని తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, తదితరులు సభాస్థలాన్ని పరిశీలించారు.
Read Also: Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
ఈనెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినా అదేరోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండడం.. ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి వుండడంతో చంద్రబాబు తన కార్యక్రమాన్ని 12కు వాయిదా వేసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.. దానికి ముందు 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.