NTV Telugu Site icon

China Manja : ఆర్మీ జవాన్‌ ప్రాణం బలిగొన్న చైనా మాంజా

Dead Body

Dead Body

చైనా మాంజా దారం తగిలి గొంతుపై బలమైన గాయం కావడంతో ఓ ఆర్మీ జవాన్‌ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని లంగర్‌ హౌజ్‌లో చోటు చేసుకుంది. వైజాగ్‌కు చెందిన కె.కోటేశ్వర్‌రెడ్డి (28) గోల్కొండ మిలటరీ ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని అత్తాపూర్‌లోని తన ఇంటికి వెళ్తుండగా లంగర్‌ హౌజ్‌ ఫ్లైఓవర్‌పై చైనా మాంజా తన గొంతుకు తగిలింది. దీంతో కోటేశ్వర్ మెడపై బలమైన గాయం తగిలి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని లాంగర్ హౌజ్ ఇన్‌స్పెక్టర్ జె నిరంజన్ రావు తెలిపారు.

కోటేశ్వర్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే.. ఇప్పటికే పలువురు గాలిపటాలు ఎగురవేస్తూ మృత్యుఒడిలోకి జారుకోవడం ఆయా కుటుంబాలను విషాదంలో ముంచాయి. గాలిపటాలు ఎగురవేస్తునప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రమాదం కలిగించే చైనా మాంజా వాడకూడదని హెచ్చరికలు జారీ చేసినా కొందరు నిబంధనలు ఉల్లంఘించి చైనా మాంజా విక్రయిస్తున్నారు. పండుగను ఎంతో సుఖసంతోషాలతో జరుపుకోవాలని భావిస్తున్న వేళలో ఇలాంటి వార్తలు వినడం బాధాకరంగా ఉందని పలువురు అంటున్నారు.

Show comments