Kodikathi Fight: అనకాపల్లి జిల్లాలో కోడికత్తి దాడి కేసు కులం రంగు పులుముకుంది. నిందితులపై చర్యలు చేపట్టాలని ప్రత్యర్థి వర్గం రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన యువకులు మధ్య కనుమపండుగ రోజు కోడి పందాల విషయంలో వాగ్వివాదం జరిగింది. ఉదయం జరిగిన తోపులాట జరగ్గా స్థానికులు సర్ది చెప్పడంతో ఎవరికి వాళ్ళు పందాల బరి దగ్గర నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం మరోసారి వడ్డాది జంక్షన్ దగ్గర ఇరువర్గాలు ఎదురు పడడంతో ఘర్షణ చోటు చేసుకుంది.
Read Also: BC Janardhan Reddy: నరసరావుపేటలో కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం కావడం శుభపరిణామం
ఈ గొడవలో బొర్రా తేజాపై శ్రీరామ్మూర్తి అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసినట్టు బాధితులు చెబుతున్నారు. మెడపై తీవ్రంగా కత్తి గాయాలు అవ్వడంతో తేజను మెరుగైన వైద్య సేవల కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు గాయపడిన తేజా కుటుంబం, స్నేహితులు, బంధువులు వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్‌ను దిగ్భందించారు. బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడంతో ట్రాఫిక్ రాకపోకలకు విఘాతం కలిగింది. డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో పోలీసు పహారా కొనసాగిస్తున్నారు.