AR Rahman Birthday: ఎ.ఆర్.రహమాన్ స్వరవిన్యాసాలకు అభిమానులు కానివారు ఎవరుంటారు? మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ కొన్ని పాటలతో ఆకట్టుకున్నారు రహమాన్. ఆయన మాయాజాలం ఇంకా పనిచేస్తూనే ఉందని చెప్పవచ్చు. ఆయన తెలుగువారు కాకపోయినా, ఆయనంటే మన తెలుగువారికి ఎంతో అభిమానం. అలాగే రహమాన్ తల్లి కస్తూరి జన్మస్థలం మన తెలుగునేలలోని హైదరాబాద్. ఆయన తండ్రి రాజగోపాల కులశేఖరన్ తమిళుడైనా, మళయాళ చిత్రాలకు ఎక్కువగా సంగీతం సమకూర్చారు. అలాగే ఎంతోమంది తెలుగు సంగీత దర్శకుల వద్ద కూడా ఆర్.కె.శేఖరన్ పనిచేశారు. ఇక రహమాన్ తల్లిదండ్రులు కస్తూరి, ఆర్.కె.శేఖరన్ తిరుమలలో వివాహం చేసుకున్నారు. రహమాన్ మొదటి పేరు ఎ.ఎస్. దిలీప్ కుమార్. దిలీప్ కు పదేళ్ళ వయసులోనే తండ్రి శేఖరన్ కన్నుమూశారు. దాంతో రహమాన్ తనకు తెలిసిన కీ బోర్డ్ ప్లే చేసుకుంటూ జీవనోపాధికై పలువురు సంగీత దర్శకుల వద్ద పనిచేశారు.
తెలుగు సంగీత దర్శకులు రమేశ్ నాయుడు, రాజ్-కోటి వద్ద చాలా రోజులు పనిచేశారు రహమాన్. అలాగే తెలుగువాడయిన గాయకుడు మనో అంటే రహమాన్ కు ఎంతో అభిమానం. తాను గురువులుగా భావించే రాజ్-కోటి వంద సినిమాలు పూర్తి చేసుకున్నప్పుడు రహమాన్ వారిని ఘనంగా సన్మానించారు. తన మిత్రుడు మనో సంగీతం సమకూర్చిన ‘సోంబేరీ’ చిత్రం ఆడియో ఉత్సవానికి రహమాన్ ఎంతో బిజీగా ఉన్నా, అదే పనిగా హైదరాబాద్ వచ్చి తన స్నేహబంధాన్ని చాటుకున్నారు. ఈ చిత్రంలో ఆలీ హీరోగా నటించారు.
Read Also: Anchor Suma: యాంకర్ సుమతో మల్లెమాల కొత్త షో.. ప్రోమో వైరల్
దిలీప్ గా ఉన్న రోజుల్లో రాజ్-కోటి వద్ద పనిచేసే సమయాన అనేక తెలుగు చిత్రాలకు రహమాన్ కీ బోర్డ్ ప్లేయర్ గా పనిచేశారు అలా చిరంజీవి సొంత చిత్రం ‘త్రినేత్రుడు’కు పనిచేశారు రహమాన్. అలాగే బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘నిప్పురవ్వ’కు రహమాన్ నేపథ్య సంగీతం అందించారు. రహమాన్ తొలి తెలుగు స్ట్రెయిట్ మూవీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సూపర్ పోలీస్’. నాగార్జున హీరోగా తమిళంలో రూపొందిన ‘రచ్చగన్’కు రహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా తెలుగులో ‘రక్షకుడు’ పేరుతో అనువాదమయింది. ఇందులోని పాటలు విశేషంగా అలరించాయి పవన్ కళ్యాణ్ ‘కొమురం పులి’, మహేశ్ బాబు ‘నాని’కి కూడా రహమాన్ స్వరకల్పన చేశారు. ఇవేవీ అంతగా ఆకట్టుకోలేక పోయాయి.
రహమాన్ స్ట్రెయిట్ తెలుగు మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఉంది. దానిని ‘ఏ మాయ చేశావే’ చెరిపేసింది. ఆ సినిమా నాగచైతన్యకు తొలి విజయాన్ని అందించింది. ఆ పై నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం సైతం రహమాన్ బాణీల్లోనే రూపొందింది. అయితే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పటికీ టాలీవుడ్ స్టార్స్ కు రహమాన్ సంగీతం అచ్చిరాదనే సెంటిమెంట్ ఉంది.
రహమాన్ అనువాద చిత్రాలకు రాజశ్రీ, వేటూరి, భువనచంద్ర వంటి ప్రముఖ గీతరచయితలు పనిచేశారు. తన బాణీలకు తగ్గ పాటను అందిస్తే చాలు రహమాన్ వారిని ముద్దులతో ముంచెత్తేవారట. ఈ విషయాన్ని వేటూరి స్వయంగా రాసుకున్నారు. దిలీప్ గా ఉన్న సమయంలోనే ఈ గీతరచయితలందరితోనూ రహమాన్ కు పరిచయం ఉండడం వల్లే వారితో అంతటి అనుబంధం ఉందని చెప్పవచ్చు.
Read Also: Project K: ప్రభాస్ సినిమా యూనిట్ లో విషాదం, మరణించిన ప్రొడక్షన్ డిజైనర్
రహమాన్ రాకతో ఎంతోమంది వర్ధమాన సంగీతకళాకారులకు ఉపాధి లభించింది. గాయనీగాయకులుగా ఎందరినో ఆయన పరిచయం చేశారు. రహమాన్ స్వరకల్పనలో ఎస్పీ బాలు పాడడం తగ్గిపోవడానికి అదే కారణం అని ఎంతోమంది అనేవారు. చిత్రమేమిటంటే, బాలుకు తమిళ సినిమా ‘మిన్సార కనవు’ ద్వారా ఉత్తమ గాయకునిగా నేషనల్ అవార్డు లభించింది. అందులో బాలు పాడిన “తంగ తామరై…” పాటకు నేషనల్ అవార్డు లభించడం విశేషం! గాయకునిగా బాలు అందుకున్న చివరి జాతీయ అవార్డు అదే కావడం గమనార్హం!
తెలుగువారయిన రామ్ గోపాల్ వర్మ హిందీలో తెరకెక్కించిన ‘రంగీలా’ చిత్రానికి రహమాన్ బాణీలు ప్రాణం పోశాయి. ఈ సినిమా తెలుగులో ‘రంగేళీ’ పేరుతో అనువాదమయింది. పాటలతో పరవశింప చేసింది. బి.గోపాల్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్ మాస్టర్’కు కూడా రహమాన్ బాణీలు మ్యాజిక్ చేశాయి. ఫలితం ఎలా ఉన్నా ఇందులోని పాటలు మాత్రం జనాన్ని కట్టిపడేశాయి. తెలుగువారన్నా, తెలుగు అన్నా ఎంతో అభిమానమున్న రహమాన్ ఇప్పటి దాకా స్ట్రెయిట్ తెలుగు మూవీతో అదిరిపోయే హిట్ అందుకోలేక పోయారు. ఇప్పుడయితే ఆయన హిందీ, తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. వచ్చే యేడాది దాకా ఖాళీ లేదు. మరి ఇక ముందైనా స్ట్రెయిట్ తెలుగు మూవీతో రహమాన్ ఘనవిజయం సాధిస్తారేమో చూడాలి.