NTV Telugu Site icon

APSRTC: వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ..

Apsrtc

Apsrtc

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులతో పాటు.. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు.. అరుణాచం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు ప్రకటించింది.. కార్తీక మాసంలో శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి ఉంటుంది.. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని.. ఒకే రోజు పంచారామ క్షేత్రాలను దర్శించేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.. వారి కోసం ఈ నెల 19, 26 తేదీలతో పాటు డిసెంబర్‌ 3, 10 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురంలో బస్సు బయల్దేరనుండగా.. సోమవారం ఉదయం అమరావతి- అమరేశ్వరుడు, భీమవరం- భీమేశ్వరుడు, పాలకొల్లు- క్షీర రామలింగేశ్వరుడు, ద్రాక్షారామం – భీమలింగేశ్వరుడు, సామర్లకోట- కుమార లింగేశ్వరుడిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్టు.. అల్ట్రా డీలక్స్‌లో ఒక్కొక్కరికి రూ.2,150 ఛార్జీగా నిర్ణయించినట్టు ప్రజా రవాణా అధికారి సుధాకర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: BJP vs BRS: నిజామాబాద్‌లో టెన్ష‌న్‌ టెన్ష‌న్‌.. 144 సెక్ష‌న్ అమ‌లు

ఇక, ఇప్పటికే అయ్యప్ప భక్తులు మాలలు వేశారు.. మండల దీక్షలను బట్టే ఇప్పటికే కొందరు శబరిమల వెళ్తుండగా.. చాలా మంది జ్యోతి దర్శనానికి వెళ్లనున్నారు.. అయితే, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆరు రోజుల యాత్ర సాగేలా ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ.. కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, ఎరుమేలి, శబరిమల, మధురై, కంచి, తిరుపతి, విజయవాడలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శనకు వీలుగా యాత్ర ప్లాన్‌ చేశారు.. ఈ టూర్‌ వెళ్లేవారి కోసం.. సూపర్‌ లగ్జరీకి రూ.7,300, అల్ట్రా డీలక్స్‌కు రూ.7,200లు ఛార్జీని నిర్ణయించారు..

Read Also: Mohammed Siraj Injury: మొహ్మద్ సిరాజ్‌కు గాయం.. భారత్-న్యూజీలాండ్ సెమీఫైనల్‌లో ఆడుతాడా?

మరోవైపు.. అరుణాచలం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు.. తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. ఆ భక్తులకు అనుగుణంగా కడప జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 26వ తేదీన ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.. జమ్మలమడుగు డిపో నుంచి 26వ తేదీన బయల్దేరనున్న ఈ ప్రత్యేక బస్సు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌ మీదుగా అరుణాచలం చేరుకోనుంది.. టిక్కెట్‌ ధర అప్‌ అండ్‌ డౌన్‌ రూ. 1557గా నిర్ణయించారు. ఇక, మైదుకూరు డిపో నుంచి ఉదయం 6, ఉదయం 7, సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక సర్వీసులు బయల్దేరనుండగా.. టిక్కెట్‌ ధర రూ.1135, రూ.1414గా పేర్కొన్నారు. బద్వేలు డిపో నుంచి పోరుమామిళ్లలో ఉదయం 5.30, 6 గంటలకు సర్వీసులు బయలుదేరి.. పెంచలకోన, శ్రీకాళహస్తి, గోల్డెన్‌ టెంపుల్‌, కాణిపాకం మీదుగా వెళ్తాయి.. ఈ సర్వీసుల ధర టిక్కెట్‌ ధర రూ.1566, రూ.1475గా నిర్ణయించారు. కడప డిపో నుంచి ఉదయం 5 గంటలకు మరో ప్రత్యేక సర్వీసు నడవనుండగా.. టిక్కెట్‌ ధర రూ. 1072గా ఖరారు చేశారు.. పులివెందుల డిపో నుంచి ఉదయం 7కు బయలుదేరి పీలేరు, గోల్డెన్‌ టెంపుల్‌ మీదుగా వెళ్లే సర్వీసుకు టిక్కెట్‌ ధర రూ.1242గా.. ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం 6కు బయల్దేరి కడప మీదుగా వెళ్లే ప్రత్యేక బస్సుకు టిక్కెట్‌ ధర రూ.1273గా నిర్ణయించింది ఏపీఎస్ఆర్టీసీ.