Machani Somnath: ప్రస్తుతం జరుగు (2024) సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో.. చేనేత వర్గాలైన కుర్నీ (నేసే), పద్మశాలిల పూర్తి మద్దతు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప ముని మనవడు మాచాని సోమనాథ్‌కు ఉంటుందని ఎమ్మిగనూరు చేనేతల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. ఎమ్మిగనూరు టీడీపీ టికెట్ బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన మాచాని సోమనాథ్‌కు కేటాయించాలని కోరుతూ మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మిగనూరు చేనేతల ఐక్యవేదిక నాయకులు కేఎస్ శివన్న,బీఎల్ నాగిరెడ్డి, గడిగే లింగప్ప, మాచాని పరమేశప్పలు పత్రికా ముఖంగా విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చేనేతలు అధిక సంఖ్యాకులుగా ఉన్న నియోజకవర్గం ఎమ్మిగనూరు కావడంతో వైయస్సార్సీపి బీసీ-చేనేత మహిళకు కేటాయించిందన్నారు. అయితే టీడీపీ స్థానికంగా బలం,బలగం ఉన్న కుటుంబానికి చెందిన మాచాని సోమనాథ్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించి కేటాయించాలని కోరారు.
Read Also: Heat Waves: ఈ ఏడు సుర్రు సమ్మరే.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు!
ఎమ్మిగనూరు ప్రాంతంలో చేనేతలను ఆదుకోవడానికి వైడబ్ల్యుసీఎస్, స్పిన్నింగ్ మిల్స్‌తో పాటు చిన్న వ్యాపారులను అధిక వడ్డీల నుంచి రక్షించడానికి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఏర్పాటు, మార్కెటింగ్ కోపరేటివ్ రైస్ మిల్స్, చర్మకారులను ఆదుకునేందుకు లెదర్ సొసైటీ, రైతుల కోసం మిల్క్ సొసైటీ, మధ్యతరగతి ప్రజలు ఇల్లును నిర్మించుకోవడానికి హౌసింగ్ సొసైటీలను స్థాపించి ఎందరికో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్ప అని తెలిపారు. మహనీయుడైన సోమప్ప వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన తనయుడు యం.యస్. శివన్న ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్‌గా పలు పర్యాయాలు ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు నీతి, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ.. సేవలు అందించారని గుర్తు చేశారు. మాచాని రఘునాథ్ కూడా తాత, తండ్రి సేవలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలో.. నిరంతరం ఉంటున్నారని తెలిపారు.
మూడున్నర దశాబ్దాల (1989) అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీ నినాదం బలంగా వినిపిస్తుంది. దీంతో ఎమ్మిగనూరు టీడీపీ టికెట్ పద్మశ్రీ మాచాని సోమప్ప నుండి మాచాని సోమనాథ్ వరకు ప్రజా సేవలో ఉన్న ఎం.జి. కుటుంబానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో.. టీడీపీ టికెట్ మాచాని సోమనాథ్‌కు కేటాయించని పక్షంలో.. చేనేతలమంతా ఏకమై మా దారి మేము చూసుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు టీడీపీ టికెట్ మాచాని సోమనాథ్ గారికి కేటాయిస్తే..! అఖండ మెజార్టీతో గెలిపించి టిడిపి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో… ఎమ్మిగనూరు చేనేతల ఐక్యవేదిక నాయకులు శివదాసు, నారాయణ, సరోజమ్మ, నరసమ్మ, బండ్ల భాస్కర్, నజీర్,వెంకటేష్, పంపయ్య, సుడిగుండు శ్రీనివాసులు, సుధాకర్, రంగస్వామి, వెంకటేష్, శంకర్ తదితరులు ఉన్నారు.