NTV Telugu Site icon

Hyderabad: ఎయిర్‌పోర్టులో పార్క్ చేసిన విమానం ధ్వంసం..

Hyderabad

Hyderabad

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో నిలిపి ఉంచిన విమానాన్ని (ప్రైవేట్ జెట్) ఉద్దేశపూర్వకంగా పాడు చేశారనే ఆరోపణలపై అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అపోలో హాస్పిటల్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ – జగ్జీత్ సింగ్ గురువారం ఇక్కడ బేగంపేట పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

READ MORE: Jammu Kashmir: ఆర్మీ వాహనంపై దాడి.. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..

బేగంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీటీ-పీసీఆర్‌గా నమోదైన విమానం ఏప్రిల్‌లో రెండు వారాల పాటు బేగంపేట విమానాశ్రయంలో పార్క్ చేశారు. ఈ విమానం అపోలో గ్రూప్ ఛైర్మన్, ప్రతాప్ సి.రెడ్డి కి చెందినదిగా సమాచారం. ఏప్రిల్‌ 5న చెన్నై వెళ్లేందుకు విమానాన్ని పరిశీలించగా ఇంజన్‌లోని కొన్ని పరికరాలు దెబ్బతిని ఉండడాన్ని గుర్తించారు. విమానంలోని కొన్ని భాగాలకు ఉద్దేశపూర్వకంగా నష్టం జరిగినట్లు కనుగొన్నారు. దెబ్బతిన్న వస్తువులు మినిమం ఎక్విప్‌మెంట్ లిస్ట్ (ఎంఈఎల్) నిబంధనల పరిధిలోకి వచ్చినప్పటికీ విమానాన్ని టేకాఫ్‌కు అనుమతించి చెన్నైకి చేరుకున్నట్లు తెలిసింది. అయితే.. చెన్నైలో ల్యాండింగ్‌లో విమానం ఇంజిన్, వైర్లు, ఏవియానిక్స్‌కు అదనపు నష్టం జరిగినట్లు సిబ్బంది గుర్తించింది. ఈ విషయాన్ని బేగంపేట ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదని జగ్జీత్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. “ఇది అధిక భద్రతా ప్రాంతం. విమానాలు పార్క్ చేసిన స్థలం మొత్తం నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తాం. ఫుటేజీని పరిశీలిస్తున్నాం. తదుపరి విచారణ ఆధారంగా బాధ్యులను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. ”అని ఓ పోలీసు అధికారి తెలిపారు.