Site icon NTV Telugu

APL 2025: రోహిత్ సంచలన ఇన్నింగ్స్.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా తుంగభద్ర వారియర్స్!

Apl 2025

Apl 2025

APL 2025: విశాఖపట్నంలోని డా. వై.ఎస్‌. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ఫైనల్‌లో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు విజేత నువ్వా.. నేనా.. అన్నట్లుగా మ్యాచ్ అమాంతం సాగింది. ఇకపోతే టీమిండియా ప్లేయర్ అమరావతి రాయల్స్ కెప్టెన్ హనుమ విహారి బ్యాట్, బంతితో అద్భుతంగా రాణించినా.. చివరికి విజయం మాత్రం తుంగభద్ర వారియర్స్ ను చేరుకుంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమరావతి రాయల్స్ మంచి ఆరంభం చేసింది. కెప్టెన్ హనుమ విహారి, మాన్యాల ప్రణీత్ జోడీ మొదటి 6 ఓవర్లలోనే ఏకంగా 70 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించింది. ఈ ఇన్నింగ్స్ లో విహారి 37 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. మరోవైపు ప్రణీత్ 22 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 47 పరుగులతో మంచి సహకారాన్ని అందించాడు. ఆ తర్వాత పాండురంగ రాజు 22 పరుగులు, మరికొంతమంది అడపాదడపా స్కోర్ చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసింది అమరావతి రాయల్స్. ఇక తుంగభద్ర బౌలర్లలో కె.వి. శశికాంత్ 3 వికెట్లు, సి. స్టీఫెన్ 2 వికెట్లు, చెన్ను సిద్ధార్థ ఒక వికెట్ తీశారు.

డ్యుయల్ ఛానల్ ABS, కొత్త డిజైన్, కలర్తో వచ్చేసిన Royal Enfield Guerrilla 450.. ధరలు, ఫీచర్ల వివరాలు ఇలా

ఇక ఆ తర్వాత 195 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన తుంగభద్ర వారియర్స్ ఆరంభంలో కాస్త తడబడ్డ.. మధ్యలో యువ ఆటగాళ్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఇన్నింగ్స్ లో సి.ఆర్. జ్ఞానేశ్వర్ 45 బంతుల్లో 2 సిక్స్‌లు, 8 ఫోర్లతో 66 పరుగులు చేయగా.. మరోవైపు గుట్టా రోహిత్ కేవలం 28 బంతుల్లో 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 63 పరుగులతో వీరవిహారం చేయడంతో అమరావతి రాయల్స్ విజయానికి దూరమైంది. అలాగే ఎం. దత్తా రెడ్డి 12 బంతుల్లో 25 పరుగులు, మ్యాచ్ చివర్లో కె.వి. శశికాంత్ (7*) హనుమ విహారి వేసిన ఓవర్ చివరి బంతిని సిక్స్‌గా కొట్టి జట్టుకు 12 బంతులు మిగిలి ఉండగానే విజయం అందించాడు.

దీనితో తుంగభద్ర వారియర్స్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ట్రోఫీని గెలుచుకుంది. విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్ రూ.35 లక్షల నగదు బహుమతి అందుకోగా, రన్నరప్ అయిన అమరావతి రాయల్స్ రూ.20 లక్షల నగదు బహుమతి అందుకుంది. మొత్తంగా హనుమ విహారి ఫైనల్లో అర్ధ సెంచరీ, రెండు వికెట్లు తీసి మెరిసినా.. ఫలితం ఇవ్వలేదు. గుట్టా రోహిత్ సిక్సర్ల వర్షం, జ్ఞానేశ్వర్ కీలక ఇన్నింగ్స్ తుంగభద్ర వారియర్స్‌ను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 చాంపియన్స్‌గా నిలబెట్టాయి.

Russia Ukraine War: ఆగని యుద్ధం.. ఉక్రెయిన్‌లోని రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్న రష్యా!

Exit mobile version