NTV Telugu Site icon

AP Elections 2024: అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన ఓటింగ్.. తుది పోలింగ్ శాతం ఎంతంటే?

Ap Elections 2024

Ap Elections 2024

AP Elections 2024: ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సోమవారం ముగిసింది. ఓటర్లు బస్సులు, ఫ్లైట్‌లు, రైళ్లలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండా వానను కూడా లెక్క చేయకుండా జనం ఓటేశారు. పలు చోట్ల హింసాత్మక దాడులకు కూడా భయపడకుండా ఏపీ ఓటర్లు చైతన్యంతో తమ తీర్పును ఈవీఎం బాక్సులలో నిక్షిప్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 గంటలకే ఓటింగ్ సమయం ముగిసినా.. అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉండడంతో వారందిరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 4 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ భారీగా పెరగనుంది. మరో వైపు.. 47 చోట్ల అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరగనుంది. ఏపీలో ఎంత శాతం పోలింగ్‌ నమోదైంది అనేది తేల్చేందుకు ఎన్నికల సంఘం లెక్కలు తేలుస్తోంది.

Read Also: AP CEO MK Meena: పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది..

తుది పోలింగ్ శాతం ఎంత అనే అంశంపై లెక్కలు తేల్చేందుకు ఈసీ నిమగ్నమైంది. తాజా లెక్కల ప్రకారం 80.05 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. విశాఖ, శ్రీకాకుళం, సత్యసాయి, మచిలీపట్నం, నెల్లూరు, తూర్పు గోదావరి , అనంతపురం జిల్లాలో ఆలస్యంగా పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ 1.25 శాతంతో కలిపి మొత్తంగా ఇప్పటి వరకు 81.30 మేర పోలింగ్ నమోదైనట్లు సమాచారం. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఇంకాఈసీ వర్గాలు క్రోడీకరిస్తున్నాయి. ఈ సాయంత్రానికి ఫైనల్ ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంది.