AP Petrol Supply: ఏపీలో పెట్రోల్ సరఫరా కోతలు.. బంక్ యజమానుల్లో ఆందోళన!

  • పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో కొత్త సమస్య
  • పెట్రోల్ బంకులకు సరఫరా కోతలు
  • రాష్ట్ర వ్యాప్తంగా బంక్ యజమానుల్లో ఆందోళన
Petrol and Diesel Prices

Petrol and Diesel Prices

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో కొత్త సమస్య తలెత్తింది. ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ బంకులకు సరఫరాలో కోతలు విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంక్ యజమానుల్లో ఆందోళన నెలకొంది. సరఫరా తగ్గిపోవడంతో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీలు, డీలర్స్ మధ్య కీలక చర్చలు నేడు జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు కానూరులోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొననున్నారు. ఇంధన సరఫరా విధానం, ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలపై చర్చించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న రేషన్ విధానాన్ని తొలగించాలని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. సరఫరా పక్కాగా, నిరంతరాయంగా కొనసాగాలని వారు కోరుతున్నారు. బంక్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థలో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు ఆయిల్ కంపెనీలు మాత్రం సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని బంకులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇండస్ట్రీస్, పెద్ద కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ సరఫరా చేయడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశముండడంతో అందరి దృష్టి ఈ సమావేశంపైనే ఉంది. సమస్యకు సరైన పరిష్కారం దొరకుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.