AP Panchayat Elections: తిరుపతి, బాపట్ల జిల్లాల్లో హైటెన్షన్.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Tensions In Tirupati And Bapatla

Tensions In Tirupati And Bapatla

Tensions in Tirupati and Bapatla: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ వేళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరగగా.. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం తీవ్రరూపం దాల్చింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. బచ్చులవారిపాలెంలో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

తిరుపతి రూరల్ మండలం ముళ్లపూడి గ్రామంలో బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోకి రావడంతో వివాదం మొదలైంది. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పోలింగ్ బూత్‌లలోకి చొరబడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌గా ఉన్న మాజీ సర్పంచ్ శెల్వంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ నేతలు, మహిళలపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సురేష్ రెడ్డి, ధనముని రెడ్డి వర్గాల మధ్య వివాదం చెలరేగడంతో.. ఇరువర్గాల వారు కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో గ్రామంలో కొంతసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

మరోవైపు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలోని ఐదో నంబర్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొందరు ఓటర్ల ఓట్లను ఇతరులు వేసేశారంటూ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. తమ ఓట్లను మరొకరు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ ఓటర్లు అధికారులను నిలదీశారు. ఈ ఘటనపై రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఆయన వాహనంపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగి.. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.