AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!

Ap Municipal Elections 2026

Ap Municipal Elections 2026

AP Municipal Elections 2026 Update: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి జనసేన, బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకంపై తుది నిర్ణయానికి రావడమే లక్ష్యంగా చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ సమావేశానికి బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయం, మున్సిపల్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకం వంటి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీట్ల పంపకంపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. జనసేన తమకు 40 శాతం సీట్లు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. జనసేన కోరుతున్న స్థాయిలో సీట్లు కేటాయింపుపై టీడీపీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య చర్చలు కీలకంగా మారాయి.

తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే విషయంలో జనసేన పట్టువీడటం లేదని సమాచారం. మరోవైపు కూటమిలోని అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన విధంగా సీట్ల పంపకాన్ని ఖరారు చేసేందుకు టీడీపీ, బీజేపీ నేతలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం తర్వాత సీట్ల పంపకంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారనే అంశంపై కూటమి శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. చర్చల అనంతరం వెలువడే నిర్ణయం ఎన్నికల సన్నద్ధతపై ప్రభావం చూపనుంది.