MLC Ravindra Babu: ఏపీ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్థసారధి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానిస్తూ.. రాజధాని గురించి మాట్లాడే అర్హత వైసీపీ సభ్యులకు లేదని, ప్రజలు ఎన్నికల్లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్పు ఇచ్చారని అన్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత ప్రజలు వైసీపీకి ఏ విధంగా తిరస్కార తీర్పు ఇచ్చారో మనందరికీ తెలుసునని.. చంద్రబాబు అద్భుతంగా అమరావతి రాజధానిని నిర్మిస్తారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విజన్ ఏమిటో మేము చేసి చూపిస్తాం అంటూ ఆయన అన్నారు.
Read Also: Apple Launches iPad: భారత్‌లో సరికొత్త చిప్‌లతో ఐప్యాడ్‌లను విడుదల చేసిన యాపిల్
అలాగే, ఈ విషయమై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మూడురాజధానుల ప్రకటనతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ నేతలు తమ రాజధాని నిర్ణయం తప్పని గ్రహించారని అన్నారు. బొత్స సత్యనారాయణ కూడా మా నిర్ణయం తప్పని, ప్రజలు అంగీకరించలేదని ఒప్పుకున్నారు. ఈ విషయంపై వీడియోను అవసరమైతే సభలో ప్రదర్శిస్తామని వ్యాఖ్యానించారు.
మరోవైపు మంత్రి పార్థసారధి కూడా వైసీపీ నేతలపై ఘాటుగా స్పందించారు. అమరావతిపై వైసీపీ నేతలు విషం చిమ్మారని, ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని ఆయన అన్నారు. మీరు మనుషుల మధ్య నుంచే అమరావతికి వస్తున్నారనే విషయం తెలుసుకోవాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం అమరావతిలో అధికారులు ఉండేందుకు కూడా సరైన వసతులు ఏర్పాటు చేయలేదని.. హైదరాబాద్ శివారు ప్రాంతాలాగే విజయవాడ, గుంటూరు కలసిపోతున్నాయని ఆయన అన్నారు. అదే విధంగా అమరావతి నగరం కూడా విస్తరిస్తుందని, అమరావతిని గొప్ప నగరంగా మేము కడతామని అన్నారు.
Read Also: Vivo T4x 5G: 6500mAh భారీ బ్యాటరీతో బడ్జెట్ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్!
అయితే ఈ విషయంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ భిన్నంగా స్పందించారు. రాజధాని అమరావతి పై మా నిర్ణయం తప్పని మేము ఎక్కడా చెప్పలేదని, ఆ రోజు మా విధానం అది.. ఆ విధానం ప్రకారం ముందుకు వెళ్లామని తెలిపారు. రాజధానిపై రాబోయే కాలంలో ఏం జరగబోతోందనేది కాలమే చెబుతుందని ఆయన అన్నారు. మొత్తానికి అమరావతి రాజధాని అంశంపై రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.