NTV Telugu Site icon

Visakhapatnam: ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌.. వైజాగ్‌ బాటపట్టిన ఏపీ మంత్రులు..

Vizag

Vizag

Visakhapatnam: విశాఖ రాజధాని కళను సంతరించుకుంటోంది. డిసెంబర్ నాటికి మకాం మారుస్తున్నట్టు సీఎం వైఎస్‌ జగన్ ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్‌లో ఏరోజున అడుగుపెడతారనేది క్లారిటీ లేదు. ఐతే.. ఈసారి రావడం మాత్రం పక్కా అంటోంది వైసీపీ. ప్రభుత్వ వర్గాలు సైతం ఇదే నిర్ధారిస్తున్నాయి. ఇందుకు అనుకూలమైన పరిస్థితులు సాగరతీరంలో కనిపిస్తున్నాయి. క్యాంపు కార్యాలయంగా ప్రచారంలో ఉన్న ఋషికొండలో నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సీఎంవోతో పాటు తరలి వచ్చే కార్యాలయాలు, అధికారుల వసతి భవనాలపై ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ నగరంలో రెండు రోజులు పర్యటించింది. వివిధ శాఖల దగ్గర నుంచి పూర్తిస్థాయి సమాచారం సేకరించింది. కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కార్యకలాపాల నిర్వహణ, సమీక్షలు, సీఎం బస కోసం అందుబాటులో ఉన్న వనరులు…వసతుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు చేయనుంది.

అయితే, అంతకంటే ముందే మంత్రులు విశాఖకు మకాం మార్చే పనిలో పడిపోయారు. కొందరు అనుకూలమైన భవనాలను వెతుక్కుంటున్నారు. మరికొంతమంది మంత్రులు ఇప్పటికే మకాం మార్చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు సహా మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలకు ఇక్కడ నివాసాలు ఉన్నాయి. రాజకీయ, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు నగరంతోనే ముడిపడి ఉండటంతో ఇక్కడ గెస్ట్‌హౌస్‌లు, ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, నేతలకు ఇక్కడ స్థిరాస్తులు ఉన్నాయి. వ్యాపార అవసరాల కోసం కొందరు దక్షిణ కోస్తా ప్రాంత నేతలకు విశాఖతో మంచి అనుబంధం ఉంది. రాయలసీమకు చెందిన నేతలు ఇక్కడ విల్లాలు, ఇళ్లు కోనుగోలు చేసినప్పటికీ.. ఆ సంఖ్య స్వల్పమే.

అమాత్యులు ఒక్కొక్కరుగా ఇక్కడ ఇళ్లు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. బీచ్‌రోడ్డు, ఋషికొండ, మధురవాడ, సీతమ్మధార వంటి కీలకమైన చోట్ల భవనాలు వెతుక్కొని మకాం పెట్టేస్తున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తాను నాలుగు నెలల క్రితమే వైజాగ్ షిఫ్ట్ అయిపోయానని ప్రకటించారు. మరోవైపు.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన తర్వాత స్టీల్ సిటీకి ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. వాస్తవానికి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. న్యాయ, రాజకీయపరమై ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ అధిగమించే క్రమంలో అనుకున్న దానికంటే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంశం ఆలస్యమైంది.