Ambati Rambabu: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. పోలవరం నిర్మాణ పనులపై మంత్రి ఆరా తీశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష చేపట్టారు. లోయర్, అప్పర్ కాపర్ డ్యాంలు రెండు పూర్తయిన తర్వాత వస్తున్న మొదటి వరద అంటూ మంత్రి తెలిపారు. గత ఏడాది లోయర్ కాపర్ డ్యాం పూర్తి కాకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం లక్షా 20 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోందన్నారు.
Also Read: Purandeshwari: జనసేన మా మిత్రపక్షం.. త్వరలో పవన్‌తో భేటీ అవుతా..
2018లో అప్పర్ కాపర్ డ్యాం, 2015లో లోయర్ కాపర్ డ్యాం నిర్మించడం మొదలు పెట్టారని.. గత ప్రభుత్వాలు ప్రొటోకాల్ లేకుండా పనులు చేపట్టారని విమర్శించారు. దీని వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోయర్, అప్పర్ కాపర్ డ్యాంలను పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వాలు ఎంతటి తప్పిదాలు చేశాయి అనేది పదేపదే చెప్తున్నామన్నారు. నదిని డైవర్ట్ చేసే పని చేయకుండా లోయర్, అప్పర్ కాపర్ డ్యాం పనులు చేపట్టారన్నారు. నది డైవర్ట్ అయ్యే అవకాశం లేకపోవడం వల్ల 54గ్రామాలు మునుగుతాయని అని పిటిషన్ వేశారన్నారు. వరద ఇంకా పెరిగి పనులు జరిగే ప్రాంతానికి నీరు చేరితే పనులు ఆపేస్తామన్నారు. వరద సమయంలో సాధ్యమైనంత వరకు పనులు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
మంత్రి అంబటి మాట్లాడుతూ.. “గత ప్రభుత్వం ప్రొటోకాల్‌కు విరుద్దంగా పనులు చేపట్టింది. గత ప్రభుత్వం పోలవరం పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయింది? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్ట్ ఆలస్యమైంది. పోలవరం ప్రాజెక్ట్‌పై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మా ప్రభుత్వంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది” అని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.