ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3:00 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సగటున 48.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 96,89,061 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 3 గంటల వరకు 46,54,133 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. కర్నూలు జిల్లాలోని గూడూరు (K) మున్సిపాలిటీలో అత్యధికంగా 73.96% పోలింగ్ నమోదు కాగా, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 73.64% పోలింగ్‌తో ప్రజలు భారీగా తరలివచ్చారు. మరోవైపు విశాఖపట్నం జిల్లాలోని జీవీఎంసీ పరిధిలో అత్యల్పంగా 39.72% మాత్రమే పోలింగ్ నమోదైంది. ప్రధాన నగరాలైన విజయవాడలో 41.80%, గుంటూరు కార్పొరేషన్లో 40.99% (ఇప్పటివరకు 2,53,584 మంది ఓటు వేశారు), నెల్లూరులో 40.91%, తిరుపతి నగరంలో 42.12% చొప్పున పోలింగ్ రికార్డయింది. తిరుపతి జిల్లా పుత్తూరులో అత్యధికంగా 64.66 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక ఎన్టీఆర్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కొండపల్లిలో 59.03%, తిరువూరులో 61.25%, నందిగామలో 62.39%, జగ్గయ్యపేటలో 58.25% పోలింగ్ జరిగింది. అలాగే కాకినాడ జిల్లా మున్సిపాలిటీల వారీగా చూస్తే గొల్లప్రోలులో 63.55%, పిఠాపురంలో 63.16%, ఏలే్వరంలో 61.22%, సామర్లకోటలో 58.00%, పెద్దాపురంలో 57.02%, తునిలో 55.95% చొప్పున ఓటింగ్ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరి ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటుండగా.. మరికొన్ని నగర ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ శాతం మందకొడిగా సాగింది. సాయంత్రం సమయానికి ఓటింగ్ మరింత పుంజుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

