NTV Telugu Site icon

AP Assembly budget Session: వచ్చే నెలలో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..

Assembly

Assembly

AP Assembly budget Session: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది.. ఎన్నికల కంటే ముందు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అప్పటి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. అయితే, వచ్చే నెలాఖరుతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ గడువు ముగియనుంది.. ఈ నేపథ్యంలో.. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌.. దీని కోసం వచ్చే నెల (జులై) మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది.. ఈ సమావేశాల్లో ఆగస్టు 2024 నుంచి మార్చి 2025 వరకు అవసరమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టి.. ఆమోదం తెలపడానికి ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.. అయితే, త్వరలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపొందించి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టడం.. చర్చ అనంతరం ఆమోదింపజేయడం అజెండాగా ఈ సమావేశాలు సాగనున్నాయి.

Read Also: CM Revanth Reddy: ఈ నెల 28న వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

కాగా, ఈ రోజు తొలి కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ సర్కార్.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో.. కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.. అంతేకాదు.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సస్ కు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.. ఇక, హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు.. కేబినెట్‌ భేటీలో శ్వేత పత్రాల విడుదలపై చర్చ జరిగింది.. ఏడు అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.. గత ప్రభుత్వ పరిపాలనపై శ్వేత పత్రాలు విడుదల చేయడం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు. వ్యవస్థలను పరిపాలనను వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఏ స్థాయిలో ధ్వంసం చేసిన విధానాన్ని వైట్ పేపర్లలో తెలపాలని పలువురు మంత్రులు సూచించగా.. ఏయే అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయొచ్చని మంత్రుల అభిప్రాయాలు కోరారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.. పర్యావరణంలో భాగంగా ఇసుక, గనుల విషయమై శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయించింది ఏపీ కేబినెట్‌. ఇక, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పనపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం.