Andhrapradesh: రేపు(మంగళవారం) మున్సిపల్ కార్మిక సంఘాలను ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కార్మిక సంఘాలతో మంత్రులు భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో చర్చలు జరగనున్నాయి. సచివాలయంలోని సెకెండ్ బ్లాక్‌లో సమావేశం జరగనుంది. సమాన పనికి సమాన వేతనంపై సీఐటీయూ పట్టుబడుతోంది. ఇప్పటికే మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు మరికొన్ని క్యాటగిరీలకు కూడా ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది.
Read Also: Attack on Minister Office: మంత్రి విడదల రజినీ కార్యాలయంపై దాడి.. 30 మంది అరెస్ట్
గతంలో తమ డిమాండ్లన్నీ పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని మున్సిపల్ కార్మికుల సంఘాలు తేల్చిచెప్పాయి. కార్మిక సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని, లేదా సమాన పనికి సమాన వేతనంగా నెలకు రూ.20వేలు బేసిక్ పే ఇవ్వాలని సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో మున్సిపాలిటీల్లో సమ్మెలో ఉన్న కార్మిక సంఘాల నాయకులతో పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి సచివాలయంలోని తన చాంబర్‌లో ఐదారు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీఎండబ్లూఈఎఫ్, ఏఐసీటీయూ, టీఎన్‌టీయూసీ, ఐఎ్‌ఫటీయూ, ఎమ్మార్పీఎస్ సంఘాల నాయకులతో పాటు ఇతర సంఘాలు చర్చల్లో పాల్గొన్నాయి. సమ్మె విరమించాలని మంత్రి కోరగా, తమ డిమాండ్లు అన్నింటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే, చర్చల సారాంశాన్ని కార్మికులకు వివరించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని నాయకులు తేల్చిచెప్పారు. కార్మికుల నుంచి స్పష్టత తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ సారి చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది.