AP Government: వారసత్వ భూముల బదలాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారసత్వ భూములకు ఆటో మ్యుటేషన్ విధానం అమలు చేయనుంది. దీంతో భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేర్లు నమోదు కానున్నాయి. ఇప్పటివరకు వారసత్వ భూముల మ్యుటేషన్ కోసం ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దరఖాస్తులు, పరిశీలనలు, అనుమతుల ప్రక్రియ కారణంగా ఆలస్యం జరిగేది. కొత్త విధానంతో ఈ ఇబ్బందులకు చెక్ పడనుంది.
వారసత్వ హక్కుల బదలాయింపులో పారదర్శకత పెంచడంతో పాటు, ప్రజలకు సులభమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత వివరాలు ఆటోమేటిక్గా రెవెన్యూ వ్యవస్థలో అప్డేట్ అయ్యే విధంగా చర్యలు చేపట్టనున్నారు. అలాగే రూ.10 లక్షల లోపు విలువైన వారసత్వ భూములకు స్టాంప్ డ్యూటీని కేవలం రూ.100గా నిర్ణయించారు. దీని వల్ల చిన్న, మధ్య తరహా భూముల వారసులకు ఆర్థిక భారం తగ్గనుంది.
వీలునామా (విల్) లేకుండా వారసత్వ భూముల బదలాయింపు జరిగే సందర్భాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (FMC) తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీని ద్వారా అసలైన వారసులను గుర్తించే ప్రక్రియ సులభతరం కానుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారసత్వ భూముల విషయంలో ఎదురయ్యే ఆలస్యాలు, అనవసరమైన కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త విధానం భూ పరిపాలనలో కీలక మార్పుగా అధికారులు భావిస్తున్నారు.

