పీఆర్సీ సహా పెండింగ్ డీఏలు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ఆహ్వానించింది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని బ్లాక్- 2 వద్ద మంత్రుల కమిటీతో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపనున్నారు. కాగా, పెండింగ్ డీఏలతో పాటు బకాయి పడిన సరెండర్ లీవ్‌లు, పెన్షన్ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగులకు చెందిన కాంట్రిబ్యూషన్ అన్నీ కలిపి 20 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. 12 పీఆర్సీకి ఇంకా ప్రతిపాదనలు స్వీకరించకపోవటంతో ఏపీ సర్కార్ మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Inflation : ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు.. తెచ్చేందుకు ట్రై చేస్తున్నాం : ఆర్‌బీఐ గవర్నర్
కాగా, ఏపీ ఎన్జీవో నేతృత్వంలోని ఏపీజేఏసీ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నెల 27 తేదీన ‘చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ఏపీజేఏసీ చెప్పుకొచ్చింది. అటు ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం సైతం కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొనింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని తెలిపింది. ఈ సమావేశంలో మధ్యంతర భృతికి సంబంధించిన ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. మరోవైపు చలో విజయవాడకు అనుమతి లేదని ఉద్యోగులు, పెన్షనర్లకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు.
