Minister Payyavula Keshav: బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(శనివారం) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశానికి ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్థూలంగా రాష్ట్రానికున్న అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న ఆర్థిక సహాయం గురించి ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించానని మంత్రి తెలిపారు. రాష్ట్ర విభజనతో వచ్చిన ఆర్థిక సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ లోపంతో కలిగిన నష్టాల గురించి ప్రస్తావించానన్నారు. జులైలో మొత్తం రూ.7000 పెన్షన్ ఇచ్చే విషయంలో అనుమానం అవసరం లేదన్నారు. రుణాలు సేకరణ నిరంతరం ప్రక్రియ అని.. రుణ సేకరణపై రిజర్వ్ బ్యాంక్‌తో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుందని పేర్కొన్నారు.
మెగా రహదారుల నిర్మాణంలో భాగంగా ఏపీలో పరిశ్రమల కారిడార్లను ఏర్పాటు చేయాలని కోరానన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. విభజన చట్టంలో ప్రస్తావించిన రామాయపట్నం ఓడరేవు, “సమీకృత స్టీల్ ప్లాంట్” నిర్మాణంతో పాటు, “గ్రేహౌండ్స్” శిక్షణాలయం కోసం ఆర్ధిక సహాయం కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. అమరావతి, వెనుకబడిన జిల్లాలకి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశామన్నారు. 5 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న చేనేత రంగాన్ని మినహాయించాలని కోరామన్నారు. “గ్రీన్ ఎనర్జీ కారిడార్” కు ఏపీకి తోడ్పాటునివ్వాలని కోరినట్లు చెప్పారు. ఆర్థికంగా గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టే సామర్థ్యం చంద్రబాబునాయుడుకు ఉందనే ప్రజలు విశ్వసించి అధికారం అప్పగించారన్నారు. వివాదాలు, చిక్కులు లేని పన్నుల వ్యవస్థ ఉండాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.