NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: గత ఐదేళ్లలో పారిశుద్ధ్యంపై ఎలాంటి డబ్బులు ఖర్చులు చేయలేదు..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించడంతో పాటు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఉపముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. డయేరియా వ్యాప్తి కారణాలపై కలెక్టర్‌తో సమీక్షించారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలలో చెత్తా చెదారం పడేస్తున్నారని.. గుర్ల గ్రామంలో బహిరంగ మలవిసర్జన ఎక్కువగా ఉందని పవన్ తెలిపారు. దీనిని ఆపకపోతే ఆరోగ్య పరంగా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉందన్నారు. గత అయిదేళ్లలో ఎలాంటి డబ్బులు ఖర్చు చెయ్యలేదని.. పంచాయితీ నిధులు విడుదల చెయ్యలేకపోయారని విమర్శించారు. గత అయిదేళ్లలో కనీసం ఫిల్టర్స్ కూడా మార్చలేకపోయారన్నారు.

Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

రుషి కొండ ప్యాలెస్ కట్టారు కాని ఇలాంటి రక్షిత నీరు అందించటానికి కావల్సిన ఫిల్టర్లను మార్చలేకపోయారని మండిపడ్డారు. గత ప్రభుత్వం కనీసం మంచి నీరు అందించలేకపోయిందని.. విచారణకు సీనియర్ ఐఏఎస్ విజయానంద్‌ను నియమించారని తెలిపారు. విచారణ తర్వాత ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష ప్రకటిస్తున్నానన్నారు. జలజీవన్ మిషన్ నిధులు రాలేదన్నారు. పెదపెంకిలో కూడా శానిటేషన్ సమస్య ఉందన్నారు. అక్కడ ఫైలేరియా బాగా పెరిగిందన్నారు. బహిరంగ మలవిసర్జన నివారించాలన్నారు. దోమలు రాకుండా చూడాలి, నదుల నీరు కలుషితం కాకుండా చూడాలని అది మన బాధ్యత అంటూ పవన్ పేర్కొన్నారు. బహిరంగ మల విసర్జన నిర్మూలనకు ఎంత నిధులు అవసరం అన్నదానిపై నివేదిక తయారు చెయ్యాలని ఆదేశిస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి అవసరమైన నిధులు తెచ్చుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

 

Show comments