NTV Telugu Site icon

Pawan Kalyan: మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం: డిప్యూటీ సీఎం పవన్

Pawan Kalyan

Pawan Kalyan

మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అటవీశాఖలో ఎలాంటి సంస్కరణలకైనా తాను సహకరిస్తానని.. అదనపు నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తీసుకువస్తానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి అటవీశాఖ అంటే ఎంతో గౌరవం అని, అటవీశాఖలో అమరులైన 23 మందిని చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పారు. నేడు గుంటూరులో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ, పోలీస్ శాఖలు.. డిప్యూటీ సీఎంకు గౌరవ వందనం సమర్పించాయి.

ఉద్యోగ బాధ్యతల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అమర వీరులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… ‘మానవ జాతి మనుగడకు అటవీ సంరక్షణ అవసరం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో అనేక మంది అసువులు బాసారు. అటవీశాఖ అధికారులు ఎందరో స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రమైన దెబ్బలు తిన్నారు. స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది కుటుంబ సభ్యులకు సాయం అందించాం. అందులో అన్ని కేటగిరీల సిబ్బంది, అధికారులు ఉన్నారు. అడవులను సంరక్షణ చేయడంలో వారి పాత్ర కీలకం. అలాంటి వారు త్యాగాలు మర్చిపోకూడదు. అటవీశాఖలో యోధుల త్యాగాలను చిరస్థాయిగా నిలిచిపోయే లాగా ఏర్పాటు చేస్తాం. సంస్మరణ దినోత్సవాల వల్ల భవిష్యత్ తరాల వారికి త్యాగాల చరిత్ర తెలుస్తుంది’ అని అన్నారు.

‘నాకు చిన్నప్పటి నుంచి అటవీశాఖ అంటే గౌరవం. అటవీశాఖలో అమరులైన 23 మందిని చరిత్ర తలుచుకునే లాగా ఏర్పాటు చేస్తాం. నా చేతిలో అటవీశాఖ ఉన్నంతవరకు అటవీశాఖ అధికారులు స్వేచ్ఛగా పనిచేయవచ్చు. అటవీశాఖ కోసం, పారిశ్రామికవేత్తల నుండి విరాళాలు సేకరిస్తాం. అమరవీరుల స్థూపాలు నిర్మిస్తాం. దండి సత్యాగ్రహం విగ్రహాల స్ఫూర్తితో, అటవీశాఖ అమరవీరుల స్థూపాలు నిర్మిస్తాం. అమరవీరుడు ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అటవీశాఖలో ఎలాంటి సంస్కరణలైనా చేయండి, నేను సహకరిస్తా. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి అదనపు నిధులు కావాలంటే నేను తీసుకువస్తా’ అని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు.

Show comments