ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ మారిపోయారా? ప్రభుత్వ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇన్నాళ్ళు కాస్త కామ్‌గా ఉన్న పవన్ ఇక స్పీడైపోవాలని నిర్ణయించుకున్నారా? అందుకే వాయిస్ పెంచుతున్నారా? ఈ తాజా మార్పునకు కారణం ఏంటి? ఉప ముఖ్యమంత్రి వైఖరిలో ఎలాంటి తేడాలు కనిపిస్తున్నాయి?
ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టు బిగిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్… మెల్లిగా వాయిస్ పెంచుతున్నారు. ఆయన సరిగా స్పందించడం లేదని మొదట్లో విమర్శలు వచ్చినా…, ఈమధ్య కాలంలో ధోరణి మారిన సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. మేటర్ ఏదైనాసరే… మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కేబినెట్ సమావేశాల్లో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం, ఇబ్బందికరమైన నిర్ణయాలను నిలవరించడంలో కీలకంగా మారతున్నారాయన. మరో వైపు అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తడం, అవినీతి, నిర్లక్ష్యంపై ప్రశ్నించి నిలదీయడంలాంటి చర్యలతో ఇటు పాలనాపరంగా, అటు పొలిటికల్‌గా ఆయన యాక్టివ్ అయ్యారన్న అభిప్రాయం పెరుగుతోంది.
తన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కూటమిలోని మిగతా రెండు పక్షాల ఎమ్మెల్యేల తీరును కూడా పాయింట్ అవుట్ చేస్తున్నారాయన. పోలీసు శాఖ, పీడీఎస్ వ్యవస్థ, జిల్లా స్థాయి పరిపాలనలో లోపాలపై ఆయన సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తప్పులు పట్టడమే కాకుండా వాటి పరిష్కారానికి అధికారులను కట్టుబడేలా చేస్తున్నారు పవన్. అటవీ శాఖ మంత్రిగా…. భూకబ్జాలు, కలప అక్రమ రవాణా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై చర్యలు, అక్రమ ఆక్రమణలపై ఆధారాలు సేకరించడం, ప్రకృతి వనరుల సంరక్షణపై ప్రత్యేకందా దృష్టి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. మరీ ముఖ్యంగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని డైరెక్ట్‌గా కోట్ చేస్తూ… ఆయన కుటుంబం మంగళంపేటలో అటవీ భూములు ఆక్రమించిందని, అడవుల మధ్యలో వారసత్వ భూములు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించడం కలకలం రేపుతోంది.
ఇక తిరుపతి పర్యటనలో ఉన్నప్పుడు… చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాలకు పాల్పడుతున్నారని, తన అనుచరులతో కలిసి మట్టి, గ్రావెల్, భూ దందాలు నిర్వహిస్తున్నారని జనసేన పార్టీ ఇన్‌చార్జ్ దేవర మనోహర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూములు కాపాడటంలో ఎటువంటి రాజీ ఉండబోదని తేల్చి చెప్పారు ఉప ముఖ్యమంత్రి. ఈ అంశాల పై వెంటనే దృష్టి సారించాలని పవన్ అధికారులను ఆదేశించడం, ఆ వెంటనే విచారణ ప్రారంభం అవడం చూస్తుంటే…. ఆయన ఫుల్ యాక్షన్‌లోకి వచ్చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అలాగే… గతంలో కేబినెట్ మీటింగ్‌లోనే అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణను వ్యతిరేకించారాయన.
తర్వాత అక్రమ లే ఔట్ల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా మాట్లాడ్డంతో పాటు ఎమ్మెల్యేల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యే లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ చేస్తున్నారంటూ పెద్ద బాంబ్ పేల్చారాయన. ఇలా బ్యాక్ టు బ్యాక్ పార్టిసిపేషన్ తో కూటమిలో ప్రభుత్వంలో తన మార్క్ వేయడంతో పాటు ప్రశ్నించే తత్వం ఏమైపోయిందంటూ విమర్శించే వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో ఎక్కడా… లాప్స్ రాకుండా తాను జాగ్రతగా ఉంటూ .. తన టీంను జాగ్రతగా ఉండమని చెపుతున్నారట. టీడీపీ జనసేన మధ్య కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న విభేదాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆచితూచి స్పందిస్తున్నారు. అలా… వివిధ కోణాల్లో ఇప్పుడు పవన్ సినీ హీరో నుంచి పరిపూర్ణ నాయకుడిగా ఎదగడంపై పూర్తి శ్రద్ధ పెడుతున్నారన్నది పరిశీలకుల మాట. ప్రభుత్వ వ్యవహారాల్లో తన జోక్యాన్ని పెంచుతూ, ఉనికి, ప్రాభవం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది ఇన్‌సైడ్ టాక్.
