NTV Telugu Site icon

Nagababu Rajyasabha: రాజ్యసభకు నాగబాబుకు.. లైన్ క్లియర్ చేస్తున్న పవన్ కళ్యాణ్‌?

Nagababu

Nagababu

సినీ నటుడు, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు.. రాజ్యసభకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. బీజేపీ పెద్దలతో జనసేన రాజ్యసభ సీటుపై చర్చించారట. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించాలని కోరారట. అందుకు బీజేపీ పెద్దలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటనే ఆలస్యం అని సమాచారం.

ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా చేశారు. ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమిషన్‌ జారీ చేసింది. దాంతో కూటమి పార్టీల మధ్య వేడి రాజుకుంది. మూడు స్థానాల్లో ఒకటి టీడీపీకి ఖరారైనట్టు తెలుస్తోంది. మిగతా రెండు సీట్లలో ఒకటి జనసేనకు దక్కనుంది. ఇక మూడో స్థానం కోసం టీడీపీ, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, కంభంపాటి రామ్మోహన్‌రావు, సానా సతీష్‌, గల్లా జయదేవ్‌.. జనసేన నుంచి నాగబాబు.. బీజేపీ నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి రేస్‌లో ఉన్నారట.

Also Read: AP Weather: బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన!

ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండింటికి నాలుగేళ్ల చొప్పున పదవీకాలం ఉంది. ఒక్కదానికి మాత్రం రెండేళ్ల టర్మ్‌ మాత్రమే ఉంది. నాలుగేళ్లు పదవీకాలం ఉన్న సీట్ల కోసమే కూటమి నేతలు ఆసక్తి చూపుతున్నారు. నాలుగేళ్ల టర్మ్‌ ఉన్న సీట్లలో ఒకటి టీడీపీకి ఖరారైందట. తాజాగా రాజ్యసభకు రాజీనామా చేసిన బీద మస్తాన్‌ రావే మరలా సీటును దక్కించుకోబోతున్నారట. రెండో సీటు జనసేనకు వచ్చేలా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు. నాగబాబుకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. అనకాపల్లి వదులుకోవడంతో బీజేపీ రాజ్యసభ హామీ ఇచ్చింది. మరోవైపు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ క్రియాశీలకంగా ఉన్నారు.