NTV Telugu Site icon

Pawan Kalyan: అడవుల వినాశనానికి పాల్పడిన వారెవరైనా కటకటాల్లోకి వెళ్లాల్సిందే.. మంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరికలు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా చూశానని.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు. అడవులను కంటికి రెప్పలా కాపాడతామని.. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామన్నారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శాఖలు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవని మంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read Also: PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే వారమే పీఎం కిసాన్ నిధులు

విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళానని.. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను  చూశామన్నారు. పర్యావరణం పార్టీ సిద్ధాంతాల్లో భాగమని.. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటన్నారు. ఒక పక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలన్నారు. అయితే ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలన్నారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత ఆవశ్యకమన్నారు. రేషన్ కార్డుదార్లకు నిత్యావసరాలు పంపిణీపై ప్రత్యేక దృష్టిపెడతామని మంత్రి వెల్లడించారు. రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం, వారికి సొమ్ములు చెల్లించడంలో మెరుగైన విధానాలు అవలంబిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని.. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. అదే విధంగా సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం, స్నేహపూరిత వాతావరణం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.