NTV Telugu Site icon

CS Neerabh Kumar Prasad: రాజధాని గ్రామాల్లో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటన

Amaravati

Amaravati

CS Neerabh Kumar Prasad: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పనులు చకాచకా జరిగిపోతున్నాయి. అమరావతిలో సీఆర్‌డీఏ అధికారులు కొన్ని పనులను ప్రారంభించారు. ముఖ్యంగా అమరావతిలోని ట్రంక్ రోడ్ల వెంబడి, నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన ముళ్ల కంపలను వెంటనే తొలగించాలని ఆదేశాలు రావటంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ శనివారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఏపీ సీఆర్డ్ఏ, అమరావతి స్మార్ట్ సిటీ పనులపై కూడా ఆరా తీశారు. చెత్తతో పాటు చెట్లను తొలగించేందుకు 76 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్యం పనులను చేపడుతున్నారు. రాయపూడిలో నిర్మాణంలో ఉన్న అమరావతి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను కూడా అధికారులు పరిశీలించారు. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Chandrababu: ముస్తాబౌతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక

ఇదిలా ఉండగా తాజాగా రాజధాని గ్రామాల్లో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటించారు. రాజధాని నిర్మాణాలు.. జంగిల్ క్లియరన్స్ పనులను ఏపీ సీఎస్ పరిశీలించారు. రాజధాని భూమి పూజ చేసిన ఉద్దండరాయుని పాలెంలోని రాజధాని మినీయేచరును సీఎస్ నీరబ్ పరిశీలించారు. పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక విద్యుత్‌ తీగలను భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు నిర్మించిన నిర్మాణాలు కనిపించే పరిస్థితి లేదు. పూర్తిగా పిచ్చిచెట్లు అలుముకుపోయాయి. దీంతో వీటన్నింటిని పూర్తిగా తొలిగించే పనులు నడుస్తున్నాయి. నాలుగైదు రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. అమరావతి పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.