Inter Student Bhavyasree Dies in Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అత్యాచారం అనంతరం కళ్లు పీకి, జుట్టు కత్తిరించి.. దారుణంగా హత్య చేసి బావిలో పడేశారని యువతి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంటినుంచి వెళ్లిన మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
తమ కూతురుకి జరిగిన అన్యాయంపై కావూరివారిపల్లె పంచాయతీ వేణుగోపాలపురం గ్రామానికి చెందిన మునికృష్ణ, పద్మావతి దంపతులు సోమవారం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.. భవ్యశ్రీ ఇంటర్ చదువుతోంది. సెప్టెంబర్ 17న సాయంత్రం ఇంటి నుంచి భవ్యశ్రీ తిరిగి రాలేదు. 3 రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో శవమై కనిపించింది. భవ్యశ్రీని నలుగురు యువకులు ప్రేమ పేరుతో వేధించే వారు. వారే మాయమాటలు చెప్పి భవ్యశ్రీని ఇంటి నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసి.. కళ్లు పీకి, జుట్టు కత్తిరించి మృతదేహాన్ని బావిలో పడేశారని తల్లిదండ్రులు అంటున్నారు.
వినాయక నిమజ్జనం కోసం సెప్టెంబర్ 20న వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కొందరు బావి వద్దకు వెళ్లగా.. మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. ఆభరణాల ఆధారంగా మునికృష్ణ, పద్మావతి దంపతులు తమ కుమార్తె అని గుర్తించారు. భవ్యశ్రీ కనిపించడం లేదని సెప్టెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు వెంటనే స్పందించి ఉంటే తమ కూతురు బతికే ఉండేదని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. శవ పరీక్ష నివేదికలనూ తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మీడియాతో చెప్పారు.
Also Read: Chandrababu Naidu News: నేడు సుప్రీంకోర్టు ముందుకు మాజీ సీఎం చంద్రబాబు పిటిషన్!
సోమవారం బావిలోని నీటిని మోటారు ద్వారా తోడించగా భవ్యశ్రీ జట్టు లభించిందని ఎస్సై అనిల్ కుమార్ చెప్పారు. భవ్యశ్రీ మృతి ఫిర్యాదు అందిన వెంటనే.. దర్యాప్తు మొదలు పెట్టినట్లు చెప్పారు. అనుమానితులను పిలిపించి విచారించామని, వారి కాల్ డేటాను చెక్ చేస్తే అనుమానాస్పదంగా ఏమీ లేదని ఎస్సై చెప్పారు. యువతి మృతదేహం నుంచి తీసిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. భవ్యశ్రీ మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమా? లేదా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.