Amaravathi: ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరావతి ప్రాంతంలో.. పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కాసేపట్లో రాజధాని అమరావతి ప్రాంతంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేరనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేడు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు 50 వేల మంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Read Also: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 500లకే సిలిండర్ ఇస్తాం
సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్-5 జోన్‌లో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 27,031 మందికి పట్టాలు పంపిణీ చేస్తారు. వీరికి ఇళ్ల నిర్మాణానికి సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఔట్లు ఏర్పాటుచేశారు. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో గృహాలనూ లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వేదికపై నుంచి అమరావతి ప్రాంతంలోని 5,024 టిడ్కో ఇళ్ల పంపిణీ కూడా చేపట్టనున్నారు. అమరావతి పరిధిలో మొత్తం 1402.58 ఏకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు.