Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్‌ఏలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా వీఆర్‌ఏలు ఎదురుచూస్తున్న అంశంపై ఇవాళ శుభవార్త అందించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో తొలగించిన ఓ ఆర్ధిక ప్రయోజనాన్ని వారికి తిరిగి కల్పించడంతో పాటు దాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది. ఏపీలో వీఆర్‌ఏలకు రూ.500 డీఏ మంజూరు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన 300 రూపాయల డీఏ పునరుద్ధరణకు వీఆర్ఏలు విజ్ఞప్తి చేయగా.. ఆ అభ్యర్థనలపై సీఎం జగన్ స్పందించారు. 300 రూపాయల డీఏను పునరుద్ధరించటమే కాకుండా 500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: CM Jagan Review: జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షపై సీఎం జగన్ సమీక్ష
ఈ మేరకు ఫైల్‌పై సంతకం పెట్టినట్లుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. గతంలో డీఏ 300 రూపాయలు డీఏ ఇచ్చేవారు. గత ప్రభుత్వం ఈ డీఏను రద్దు చేసిందని ఆయన తెలిపారు. వీఆర్‌ఏలకు డీఏను పునరిద్దరించవలసిందిగా ముఖ్యమంత్రిని కలిసి కోరగా.. . అందుకు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి డీఏ తిరిగి మంజూరు చేసేలా ఫైల్ సర్కులేట్ చేయమని అధికారులను ఆదేశించారన్నారు. ఆ విధంగా సర్కులేట్ అయిన ఫైల్‌లో DA ను 300 రూపాయలకు బదులుగా 500 రూపాయలు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ సంతకం కూడా చేశారు. దీంతో వీఆర్ఏలకు ఇకపై రూ.500 డీఏ అందబోతోంది. ఈ నేపథ్యంలో వీఆర్ఏలకు డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ కు , రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, సీఎస్, ఇతర అధికారులకు ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది.