NTV Telugu Site icon

Andhra Pradesh: కలుషితాహారం తిని విద్యార్థుల మృతి.. రూ.10 లక్షల పరిహారం

Chandrababu

Chandrababu

Andhra Pradesh: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు లేదా సంరక్షకులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించారు.

Read Also: CM Chandrababu: సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం

కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 27 మంది నిన్న ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది హూటాహూటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక, తీవ్ర అస్వస్థతకు గురైన స్టూడెంట్స్‌లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించారు. మిగతా 23 మందికి నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

Read Also: CM Chandrababu: కలుషిత ఆహారంతో విద్యార్థులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలం కైలాస పట్టణం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని జాషువా, భవానీ, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతిచెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సహచరుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరుతున్నామన్నారు.